ఉన్న పార్టీని కాపాడుకోవాలి.. కొత్త పార్టీలు ఎందుకు?.. బీఆర్ఎస్ ను బీజేపీకి ధారాదత్తం చేసే కుట్ర: కవిత

"నేను పార్టీ నుంచి బయటకు వెళ్తే ఎవరికి అత్యంత లాభం జరుగుతుందో వాళ్లే నాపై కుట్ర చేశారు. నన్ను, కేసీఆర్ ను విడదీసే కుట్ర జరుగుతోంది" అని కవిత చెప్పారు.

ఉన్న పార్టీని కాపాడుకోవాలి.. కొత్త పార్టీలు ఎందుకు?.. బీఆర్ఎస్ ను బీజేపీకి ధారాదత్తం చేసే కుట్ర: కవిత

MLC Kavitha

Updated On : May 29, 2025 / 2:56 PM IST

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తరువాత సోయితో పాలన సాగడం లేదని బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్‌లో ఇవాళ కవిత మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.

“పార్టీలో ప్రతి ఒక్కరు పని చేయాలని కేసీఆర్ చెప్పారు. కానీ విదేశాల్లో మీడియా సెల్స్ పెట్టుకుని దొంగ దెబ్బ తీస్తామని అంటే ఎలా? పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా? వరంగల్ మీటింగ్ ను సక్సెస్ చేసింది కేసీఆర్. అంతా తామే చేశామని కొందరు అంటుంటే జనం నవ్వుకుంటున్నారు.

తెలంగాణ వనరులను దోచుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి పట్టం కట్టే ప్రయత్నం జరుగుతోంది. నేను జైల్లో ఉన్న సమయంలో బీజేపీతో దోస్తీ ప్రతిపాదన వస్తే నేను వద్దన్నాను. నేను జైల్లో ఉన్నా ఫర్వాలేదు, బీజేపీలో బీఆర్ఎస్‌ పార్టీని విలీనం చేయవద్దని చెప్పాను. నేను కేసీఆర్ లా తిక్కదాన్ని. నేను సూటిగా మాట్లాడతా. వెన్నుపోటు రాజకీయాలు చేయను. సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తాను.

కేసీఆర్ ఏ తప్పూ చేయలేదు. కేసీఆర్ తరువాత పార్టీలో ఉన్నవారే తప్పు చేస్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినందుకు జూన్ 3న నిరసనలు నిర్వహించాలని భావించాను. కానీ పార్టీలో నాపై పడి ఏడుస్తారని ఆలోచించాను. నన్ను పార్టీలో నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదు.

పార్టీని బీజేపీకి ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోంది. నాకు కాంగ్రెస్ అధిష్ఠానంతో ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ మునిగిపోయే నావ. నా పార్టీ బీఆర్ఎస్‌.. నా నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్‌లో ఒక్కడే లీడర్ అది కేసీఆర్. నాకు కేసీఆర్ మాత్రమే లీడర్.

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ ను గౌరవిస్తాను. ఉన్న పార్టీని కాపాడుకోవాలి, కొత్త పార్టీలు ఎందుకు? నేను అమెరికా వెళ్లి వచ్చేసరికి కుట్ర చేశారు. నేను పార్టీ నుంచి బయటకు వెళ్తే ఎవరికి అత్యంత లాభం జరుగుతుందో వాళ్లే నాపై కుట్ర చేశారు. నన్ను, కేసీఆర్ ను విడదీసే కుట్ర జరుగుతోంది” అని కవిత చెప్పారు.