Elon Musk
Twitter vs Apple: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విటర్‌ను ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న నాటినుంచి సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్నాడు. ట్విటర్‌లో పనిచేసే కీలక ఉద్యోగుల దగ్గర నుంచి, వివిధ విభాగాల్లో సగం మంది ఉద్యోగులను తొలగించాడు. ఉద్యోగుల విషయంలోనేకాకుండా బ్లూటిక్, ట్విటర్‌లో ట్రంప్ ఖాతా పునరుద్దరణ ఇలా ప్రతీవిషయంలో మస్క్ దూకుడును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్‌తోనే యుద్ధానికిసై అన్నట్లుగా మస్క్ కాలుదువ్వుతుండటం ట్విటర్‌లోని ఉద్యోగులనుసైతం ఆందోళనకు గురిచేస్తోంది. ట్విటర్‌లో ప్రకటనల కోసం యాపిల్ ఏటా దాదాపు వంద మిలియన్ డాలర్లపైనే ఖర్చు చేస్తోంది. అంటే ట్విటర్ కు ప్రధాన ఆదాయం యాపిల్ అన్నమాట. అలాంటి యాపిల్ తోనే మస్క్ అమీతుమీ అంటుండటం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
Elon Musk: ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుకు నెల రోజులు..! మస్క్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..
వాక్ స్వేచ్ఛను యాపిల్ వ్యతిరేకిస్తోదంటూ మస్క్ తన వాదనను తెరపైకి తెచ్చాడు. సోమవారం మస్క్ యాపిల్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. యాప్ స్టోర్ నుంచి ట్విటర్ ను తొలగిస్తామని యాపిల్ బెదిరిస్తోందని అన్నాడు. అంతేకాక వరుస ట్వీట్ చేసి.. యాపిల్ నుంచి వచ్చే ప్రకటనలు సైతం నిలిపివేస్తామని యాపిల్ బెదిరిస్తుందని, అసలు ఏం జరుగుతోంది అని యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను మస్క్ ప్రశ్నించాడు.
Apple has mostly stopped advertising on Twitter. Do they hate free speech in America?
— Elon Musk (@elonmusk) November 28, 2022
నిజంగానే.. యాపిల్ తన ప్లేస్టోర్ నుంచి ట్విటర్‌ను తొలగిస్తే ట్విటర్ కు నష్టం జరుగుతుంది. యాపిల్ యాప్ స్టోర్ ద్వారా దాదాపు 1.5 బిలియన్ పరికరాల్లో ట్విటర్ ను వినియోగిస్తున్నారు. ఒకవేళ యాపిల్ అనుకున్నట్లు చేస్తే అవన్నీ సామాజిక మాధ్యమానికి దూరం కావాల్సి వస్తుంది. అంతేకాదు.. ట్విటర్ కు ప్రధాన ఆదాయ వనరు యాపిల్. యాపిల్ తమ ప్రకటనల కోసం ట్విటర్‌లో దాదాపు 100 మిలియన్ డాలర్లపైనే ఖర్చు చేస్తోంది. అంటే ట్విటర్ అధికశాతం ఆదాయ వనరు యాపిల్ వద్దనే ఉందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను వాక్ స్వేచ్ఛకోసం పోరాడుతున్నానంటూ మస్క్ యాపిల్ పై యుద్ధాన్నిప్రకటించుకోవటం మార్కెట్ రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మస్క్ దూకుడు ట్విటర్ కు చేటు తెస్తుందని ఎక్కువ మంది మార్కెట్ నిపుణుల అభిప్రాయం.