ఇథియోపియా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 737 పాసింజర్ విమానం కుప్పకూలింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఆ విమానంలో మొత్తం 149 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది విమాన సిబ్బంది ఉండగా అందరూ చనిపోయినట్లు తెలుస్తుంది. ఒక్కరు కూడా బ్రతికిన జాడ కనపడలేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇథియోపియా ఎయిర్‌లైన్ నుంచి ప్రకటన వెలువడింది. విమానంలో 33దేశాలవాళ్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. అయితే ప్రమాదానికి గల స్పష్టమైన కారణం మాత్రం తెలపలేదు.
కూలిన విమాన ఆచూకీని కనుగొని, సహాయక చర్యలు అందించేందుకు గానూ సంబంధిత సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారని సంస్థ తెలిపింది. ‘ప్రమాద స్థలికి ఇథియోపియా ఎయిర్‌లైన్ సిబ్బందిని పంపుతున్నాం. అత్యవసర సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ప్రమాదంపై ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ స్పందించారు. ‘ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం’ అని ఆయన కార్యాలయ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.