Malaysia Airlines Flight MH17
Europe Court: ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం MH17 తూర్పు యుక్రెయిన్ మీదుగా 17 జులై 2014న ప్రయాణిస్తుండగా కూల్చివేయబడింది. ఈ ప్రమాదంలో 298మంది మరణించారు. వీరిలో 283 మంది ప్రయాణికులు కాగా.. 15మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఆ సమయంలో తూర్పు యుక్రెయిన్ మాస్కోకు విధేయులైన వేర్పాటువాద తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. విమానాన్ని కూల్చివేసేందుకు ఉపయోగించిన క్షిపణిని రష్యా తయారు చేసింది.
యుక్రెయిన్‌లో దశాబ్ద కాలంగా మాస్కో దురాగతాలకు పాల్పడిందని ఆరోపిస్తూ కీవ్, నెదర్లాండ్స్ దాఖలు చేసిన మరో మూడు కేసుల్లో బుధవారం యూరోపియన్ మానవ హక్కుల కోర్టు న్యాయమూర్తులు రష్యాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.
మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్17ను రష్యానే కూల్చివేసిందని కోర్టు తీర్పును వెల్లడించింది.
స్ట్రాస్‌బర్గ్‌లోని కోర్టు గదిలో కోర్టు అధ్యక్షుడు మాటియాస్ గుయోమర్ తీర్పును చదువుతూ.. ఆ క్షిపణి ఉద్దేశపూర్వకంగా ఎంహెచ్17 విమానంపై ప్రయోగించారని, బహుశా అది సైనిక విమానంగా భావించి ఉండొచ్చని ఆధారాలు సూచిస్తున్నాయని స్ట్రాస్‌బర్గ్ కోర్టు తెలిపింది. ఎంహెచ్17 విమాన విపత్తులో రష్యా తన ప్రమేయాన్ని అంగీకరించడానికి నిరాకరించడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు సైనిక లక్ష్యాలకు అతీతంగా జరిగాయని, ఉక్రెయిన్ నైతికతను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా రష్యా లైంగిక హింసను ఉపయోగించిందని కోర్టు కనుగొందని ఫ్రెంచ్ న్యాయమూర్తి అన్నారు. యుద్ధ ఆయుధంగా అత్యాచారాన్ని ఉపయోగించడం అనేది హింసకు సమానమైన తీవ్ర క్రూరత్వ చర్య అని గయోమర్ అన్నారు.
ఇక కోర్టు తీర్పుపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ తీర్పును తాము పాటించబోమని, దానికి ఎలాంటి విలువ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కొట్టిపారేశారు. మరోవైపు, ఉక్రెయిన్ ఈ తీర్పును చారిత్రక, అపూర్వ విజయంగా అభివర్ణించింది.
ఇదిలాఉంటే.. ఈ ఏడాది మే నెలలో ఐక్యరాజ్య సమితి విమానయాన సంస్థ కూడా ఈ విపత్తుకు రష్యా కారణమని తేల్చడం గమనార్హం.