Kabul
Kabul Blasts అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. సెంట్రల్ కాబూల్‌లోని వజీర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలోని మిలిటరీ హాస్పిటల్ సమీపంలో ఇవాళ బాంబు పేలుళ్లు సంభవించాయి. దీంతో పలువురు గాయపడ్డారు. బాంబు పేలుళ్ల తర్వాత ఆ ప్రదేశంలో తుపాకుల మోత వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
కాబూల్‌లో రెండు పేలుళ్లు జరిగినట్లు తాలిబన్ అంతర్గతశాఖ అధికార ప్రతినిధి ఖరీ సయీద్ ఖోస్తీ ద్రువీకరించారు. సర్దార్ మొహమ్మద్ దావూద్ ఖాన్ హాస్పిటల్ గేటు వద్ద తొలి పేలుడు సంభవించింది. రెండవ పేలుడు హాస్పిటల్ సమీపంలో జరిగినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లినట్టు ఎలాంటి సమాచారం లేదన్నారు.
పేలుళ్లు జరిగిన ప్రాంతం నుంచి తప్పించుకున్న హెల్త్ వర్కర్ ఒకరు మాట్లాడుతూ.. తొలుత పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని, ఆ తర్వాత కొన్ని నిమిషాలపాటు తుపాకుల మోత వినిపించినట్టు పేర్కొన్నాడు. పది నిమిషాల తర్వాత మరోసారి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్టు తెలిపాడు. అయితే, ఈ ఘటన ఆసుపత్రిలో ప్రాంగణంలో జరిగిందా? లేదా? అన్న విషయంలో మాత్రం స్పష్టంగా తెలియదని తెలిపారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో నెలకొన్న దట్టమైన పొగలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అయితే ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ కూడా బాధ్యత వహించలేదు.
ALSO READ Pelli SandaD : డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్