America Iran War: ట్రంప్ దూకుడు.. ఇరాన్ ప్రతీకారం.. హర్ముజ్ జలసంధిలో క్షిపణుల వర్షం.. టెన్షన్‌లో ప్రపంచ దేశాలు
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ(America Iran War) మేఘాలు కమ్ముకున్నాయి.
- V Santhosh Kumar
- Published on- July 13, 2026 / 07:27 AM IST
Fierce attacks on the Strait of Hormuz and Iran following Trump orders
- అమెరికా ఇరాన్ యుద్ధ మేఘాలు
- హర్ముజ్ జలసంధిలో భారీ దాడులు
- స్తంభించిన అంతర్జాతీయ చమురు సరఫరా
America Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణపై ఆశలు చిగురిస్తున్న తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆదివారం సాయంత్రం నుంచి భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించగా, అమెరికా జోక్యం ఆగే వరకు హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అనుమతించబోమని ఇరాన్ భీష్మించుకోవడంతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి.
భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్ ప్రావిన్సులు:
అమెరికా(America Iran War) చేపట్టిన ఐదో విడత దాడులు హర్ముజ్ జలసంధికి సమీపంలోని హోర్మోజ్‌గాన్, ఖుజెస్టాన్, సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులపై కేంద్రీకృతమయ్యాయి. బందర్ అబ్బాస్, జాస్క్, సిరిక్, ఖెష్మ్ దీవి, చాబహార్‌తో పాటు ఖొండాబ్‌లోని హెవీ వాటర్ కేంద్రం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. మహ్షహర్‌లోని నీటి పంపింగ్ స్టేషన్‌పై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇరాన్ సైన్యం (IRGC) వాణిజ్య నౌకలపై జరిపిన కాల్పులను, ఒక క్రూయిజ్ క్షిపణి, ఆత్మాహుతి డ్రోన్‌ను అమెరికా సైన్యం కూల్చివేసింది.
ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం.. భారత్‌కు సెగ:
ఈ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్, సముద్ర రవాణాపై తీవ్రంగా పడింది. హర్ముజ్ జలసంధి గుండా రోజుకు 130 నౌకలు వెళ్లాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22కు పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 79 డాలర్లకు చేరడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒమన్ తీరంలో దాడికి గురైన ‘జీఎఫ్‌ఎస్ గెలాక్సీ’ నౌకలోని 23 మంది భారతీయ నావికులను భారత్ రక్షించింది, మరో నావికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచ చమురు సరఫరాతో పాటు భారత్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
