Vietnam : అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, 54 మంది సజీవ దహనం

తొమ్మిది అంతస్థుల భవనంలో అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. 50మందికి పైగా మంటల్లో కాలిపోయారు.

Vietnam Fire Accident

Vietnam Apartment Block Fire : వియత్నాంలోని హనోయి(Hanoi )లో తొమ్మిది అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50మందికిపై మంటల్లో కాలిపోయి సజీవదహనమయ్యారు. భారీ సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో 54మంది చనిపోయారని డాన్ ట్రై మీడియా వెల్లడించింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో 54మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారని తెలిపింది.

థాన్ జువాన్ లోని జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం సంభవించిన ఈ తొమ్మిది అంతస్థుల అపార్ట్ మెంట్ లో 45 కుటుంబాలు నివాసిస్తున్నాయి. ప్రమాదం రాత్రి 11.30 గంటల సమయంలో జరగటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది.

రాత్రి సమయంలో ప్రమాదం జరగటంతో దాదాపు అందరు ఇళ్లలోనే ఉన్నారు. ప్రమాదం జరిగిందనే సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిప్రమాద సిబ్బంది మంటలు ఆర్పారు. కానీ భవనం ఇరుకు సందులో ఉండడంతో సహాయక కార్యక్రమాలకు సమస్యలు తలెత్తాయి. ఇరుకు సందు కావటంతో అగ్నిమాపక వాహనాలను దాదాపు 400 మీటలర్ల దూరంలోనే నిలిపి మంటలు ఆర్పాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా..2022లో దక్షిణ వియత్నాంలోని మూడు అంతస్తుల కరోకే బార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 32 మంది మరణించారు. ఈ ప్రమాదం దశాబ్దంలో దేశంలో జరిగిన ఘోరమైన అగ్నిప్రమాదంగా మారింది. కానీ హనోయ్ లో జరిగిన ఈ ప్రమాదం దానికి మించి జరిగింది. ఈ ప్రమాదంలో 54మంది చనిపోవటం తీవ్ర విషాదం కలిగించింది.