Indian Pilots: బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF) తన పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి భారతీయ విమాన బోధకులను ఉపయోగించుకుంటోంది. రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ ట్రైనర్ల కొరత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారత పైలట్లు RAF పైలట్లకు శిక్షణ ఇవ్వడం ఇదే మొదటిసారి. భారత్, యూకే మధ్య పెరుగుతున్న రక్షణ భాగస్వామ్యంగా కూడా దీన్ని చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక వైమానిక దళాలు.. పైలట్లు, వారికి శిక్షణ ఇచ్చే ట్రైనర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. రాయల్ ఎయిర్ ఫోర్స్ సైతం హాక్ T2 ట్రైనర్ పైలట్ల కొరత వంటి సమస్యలతో సతమతమవుతోంది.
బ్రిటిష్ వైమానిక దళం ఎందుకు ఇబ్బందుల్లో ఉంది?
RAF దాని BAE సిస్టమ్స్ హాక్ T2 అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనర్ నిర్వహణలో ఇబ్బందులు పడుతోంది. దీనికి కారణం పూర్తి స్థాయి అర్హత కలిగిన బోధకులు లేకపోవడమే. ఈ సమస్యల కారణంగా RAF కొంతమంది శిక్షణా పైలట్‌లను ట్రైనింగ్ కోసం విదేశాలకు పంపాల్సి వచ్చింది. రాయల్ ఎయిర్ ఫోర్స్ హాక్ T2 విమానం కూడా ఇంజిన్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇది దాని విమాన సమయాలను పరిమితం చేస్తుంది. ఈ విమానం కూడా వేగంగా పాతబడుతోంది. రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యామ్నాయ శిక్షణా విమానాలను ప్రొక్యూర్ (కొనుగోలు) చేయలేకపోతోంది.
భారత వైమానిక దళానికి కలిగే ప్రయోజనం..
భారత్ విషయానికి వస్తే తన సొంత హాక్ విమానాలను నిర్వహిస్తోంది. దీనికి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లైసెన్స్ ఇచ్చింది. ఇది తన బోధకులకు ఈ రకమైన విమానాలతో సంబంధిత అనుభవాన్ని అందిస్తుంది. అందుకే UK భారత్ తో కలిసి తన పైలట్లకు శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక వేసింది. ఇది రెండు దేశాల మధ్య సైనిక సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయ విమాన బోధకుల ఖ్యాతిని పెంచుతుంది.
పైలట్లకు వేగంగా శిక్షణ ఇవ్వాలని కోరిన బ్రిటన్..
పైలట్లకు వేగంగా శిక్షణ ఇవ్వడానికి బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) 2022లో ఫాస్ట్-జెట్ పైలట్ శిక్షణ వ్యవధిని 248 వారాల నుండి 187 వారాలకు తగ్గించింది. “ప్రస్తుతం RAF వద్ద ఫ్రంట్‌లైన్ డ్యూటీకి తగినంత సంఖ్యలో పైలట్లు, ఎయిర్‌క్రూలు అందుబాటులో ఉన్నారు” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ బోధకులను చేర్చడం అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి విస్తృత ప్రయత్నంలో భాగం అని తెలిపింది.
Also Read: అమెరికా-రష్యాను కలుపుతూ “ట్రంప్-పుతిన్” టన్నెల్.. మస్క్ కంపెనీకి జాక్ పాట్? ఇక ఏం జరగనుంది?