అమెరికా-రష్యాను కలుపుతూ “ట్రంప్-పుతిన్‌” టన్నెల్.. మస్క్ కంపెనీకి జాక్ పాట్? ఇక ఏం జరగనుంది?

ఈ ప్రతిపాదనపై ట్రంప్ నుంచి సానుకూల స్పందన రావడంతో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అమెరికా-రష్యాను కలుపుతూ “ట్రంప్-పుతిన్‌” టన్నెల్.. మస్క్ కంపెనీకి జాక్ పాట్? ఇక ఏం జరగనుంది?

Updated On : October 18, 2025 / 3:41 PM IST

Trump-Putin Tunnel: రష్యా చేసిన ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రష్యా నుంచి అమెరికాలోని అలాస్కా వరకు బేరింగ్ స్ట్రైట్ మీదుగా సముద్రం కింది నుంచి భారీ రైలు మార్గ టన్నెల్ నిర్మించేందుకు ఎలాన్ మస్క్ బోరింగ్ కంపెనీకి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన “ఆసక్తికరంగా ఉంది” అని ట్రంప్ అన్నారు. దీనిపై ఆలోచించాలని ట్రంప్ అనడం గమనార్హం. ఈ భారీ ప్రాజెక్టు ఒకవేళ కార్యరూపం దాల్చితే, రెండు ఖండాలను అనుసంధానించి చరిత్ర సృష్టిస్తుంది.

రష్యా విజన్ ఇదే..

రష్యా రాయబారి కిరిల్ దిమిత్రీవ్ ఈ ప్రాజెక్టును “ఐక్యతను సూచించే 70 మైళ్ల లింక్..” అని అభివర్ణించారు. ఇది కేవలం రవాణా మార్గంగా మాత్రమే కాకుండా, భౌగోళిక రాజకీయంగా కీలకమైన అనుసంధానంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Video: హైకోర్టులో అసాధారణ ఘటన.. “హద్దులు దాటకండి” అంటూ జడ్జిని పట్టుకుని ఓ లాయర్‌.. అసలేం జరిగింది?

రష్యా ప్రతిపాదన ప్రకారం.. ఈ సొరంగ నిర్మాణానికి సుమారు $65 బిలియన్ల (రూ.5 లక్షల కోట్లు) ఖర్చు అవుతుందని దిమిత్రీవ్ వెల్లడించారు. అయితే, మస్క్ బోరింగ్ కంపెనీ టన్నెలింగ్ సాంకేతికతతో ఈ ఖర్చును $8 బిలియన్ల వరకు తగ్గించవచ్చని, అంతేకాకుండా కేవలం 8 ఏళ్లలో పనిని పూర్తి చేయగలదని ఆయన తెలిపారు. మాస్కో కూడా కొంత నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉందని, “మనమంతా కలిసి భవిష్యత్తును నిర్మిద్దాం” అంటూ అంతర్జాతీయ సహకారానికి పిలుపునిచ్చారు.

యుక్రెయిన్ అసంతృప్తి

ఈ ప్రతిపాదనపై ట్రంప్ నుంచి సానుకూల స్పందన రావడంతో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్లాదిమిర్ పుతిన్, ట్రంప్ మధ్య యుక్రెయిన్ యుద్ధ పరిష్కారాలపై జరిగిన ఫోన్ సంభాషణల నేపథ్యంలోనే ఈ ప్రతిపాదన వెలుగులోకి రావడం గమనార్హం. త్వరలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో నేతృత్వంలోని బృందం రష్యా ప్రతినిధులతో సమావేశమవుతుందని, ఆ తర్వాత హంగేరీలో పుతిన్, ట్రంప్ భేటీ జరుగుతుందని ట్రంప్ ప్రకటించారు. ఇది ట్రంప్ పరిపాలనలో రష్యా పట్ల ఒక విభిన్న వైఖరిని సూచిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టు

నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. బేరింగ్ స్ట్రైట్‌లో సొరంగ నిర్మాణం అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టు. తీవ్రమైన శీతల పరిస్థితులు, మౌలిక సదుపాయాల కొరత, తరచుగా సంభవించే భూకంపాలు నిర్మాణానికి ప్రధాన అడ్డంకులు. బోరింగ్ కంపెనీ ఇంతవరకు ఇలాంటి పరిస్థితుల్లో పని చేయలేదు. వారి గత ప్రాజెక్టులన్నీ వెచ్చని వాతావరణం ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే జరిగాయి.

రష్యాతో ఎలాన్ మస్క్ కంపెనీలకు బిజినెస్‌ చేసిన అనుభవాలు ఉన్నాయి. టెస్లా కంపెనీ రుసాల్ నుంచి అల్యూమినియం కొనుగోలు చేసింది. మస్క్ 2022లో పుతిన్‌తో రహస్యంగా చర్చలు జరిపినట్లు కూడా సమాచారం ఉంది. ఆ సమయంలో చైనాకు అనుకూలంగా ఉండేందుకు తైవాన్‌లో స్టార్‌లింక్ సేవలపై పరిమితి విధించాలని పుతిన్ ఒత్తిడి చేశారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు, అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. నాసాతో స్పేస్‌ఎక్స్ సంస్థ కలిసి రష్యా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపింది.