Imran Khan ‘Jail Bharo’
Imran Khan ‘Jail Bharo’ : అవిశ్వాస తీర్మానంలో పదవి కోల్పోయిన దగ్గరనుంచి నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ర్యాలీలు, ఆందోళనలు, భారీ బహిరంగ సభలతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆయన జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విదేశీనిధుల కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు లేదా గృహనిర్బంధం చేసే అవకాశముందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన జైల్ భరో ప్రకటించారు. ఆందోళనా కార్యక్రమాలను విజయవంతం చేసే ప్రణాళికలు తమ పార్టీ దగ్గర చాలా ఉన్నాయన్నారు. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చేందుకు తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఇమ్రాన్.
ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా అరెస్టు కావచ్చు. ఏప్రిల్‌లో అవిశ్వాసతీర్మానంతో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని పదవి పోగొట్టుకున్నదగ్గర నుంచి ఆయనపై జరుగుతున్న ప్రచారం ఇది. అసలు పాకిస్తాన్ రాజకీయాలను దగ్గరగా గమనించే వాళ్లకు ఇమ్రాన్ ఖాన్ ఇప్పటిదాకా అరెస్టు కాకపోవడమే విచిత్రమనిపిస్తుంది. అయితే ప్రభుత్వ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ…నిత్యం ప్రజల్లో తిరుగుతూ తన బలం పెంచుకోవడంతో పాటు అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇమ్రాన్. అయితే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ…విదేశీనిధుల కుంభకోణంలో ఆయన అరెస్టు కాక తప్పదన్నది ప్రభుత్వం తరపు నుంచి వినిపిస్తున్న మాట. అధికారంలో ఉన్న సమయంలో విదేశాల నుంచి తన పార్టీ PTIకి భారీగా నిధులు తీసుకున్న ఆరోపణలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు PTIలోని ఇతర నేతలు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తారిఖ్ షఫీ, హమీద్ జమాన్, సైఫ్ నైజీలను పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. ఇదే క్రమంలో రేపో మాపో ఇమ్రాన్ అరెస్ట్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఇమ్రాన్‌ను హౌస్ అరెస్ట్ చేయాల్సిందిగా ఇప్పటికే ఇస్లామాబాద్ అధికారులకు ఆదేశాలందాయని వార్తలొస్తున్నాయి.
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడంతో పాటు తన పార్టీ నేతలపై బెదిరింపులకు వ్యతిరేకంగా జైల్‌భరో ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వ్యవహారశైలిని తప్పుబట్టారు. జైళ్లను నింపడానికి లక్షల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అరెస్టులకు తాము భయపడబోమని ఆయనన్నారు. ఆజాదీ మార్చ్‌ను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.
మరోవైపు ఇమ్రాన్ నిర్వహించ తలబెట్టిన ఆజాదీ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏ వైపు నుంచీ ఆయన ఇస్లామాబాద్‌లో అడుగుపెట్టడానికి ప్రయత్నించినా అదుపులోకి తీసుకునేలా ప్లాన్ బి సిద్ధం చేసింది. ఇస్లామాబాద్ చుట్టూ భారీగా బలగాలు మోహరించింది.
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయాలంటూ వారెంట్ జారీ చేసిన ఇస్లామాబాద్ కోర్టు
అటు మనీ లాండరింగ్ కేసులో ప్రధాని షెహబాజ్ షరీఫ్ లాహోర్ కోర్ట్ ఎదుట హాజరయ్యారు. పంజాజ్ ముఖ్యమంత్రిగా తాను ఎలాంటి అవినీతికీ పాల్పడలేదని స్పష్టంచేశారు. వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో షెహబాజ్ ఆయన కుమారులు హమ్జా, సులేమాన్ నిందితులుగా ఉన్నారు. షెహబాజ్‌కు, హమ్జాకు లాహోర్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 16వందల కోట్లకు సంబంధించిన ఈ కేసు విచారణ 2020 నవంబర్ నుంచి జరుగుతోంది.