అమెరికాలో భారత సంతతి వ్యక్తి తలను నరికేసిన తోటి ఉద్యోగి.. అక్కడితోనూ ఆగకుండా..

తలను నరికి, దానిని పార్కింగ్‌ లాట్‌లో తన్నాడు. ఆ తర్వాత దాన్ని పట్టుకున్న నిందితుడు సమీపంలోని డంప్‌స్టర్‌లో పడేశాడు.

అమెరికాలో భారత సంతతి వ్యక్తి తలను నరికేసిన తోటి ఉద్యోగి.. అక్కడితోనూ ఆగకుండా..

Updated On : September 12, 2025 / 1:47 PM IST

Dallas Motel: అమెరికాలోని డల్లాస్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తలను నరికి హత్య చేశాడు తోటి ఉద్యోగి. పాడైన వాషింగ్ మెషీన్‌ గురించి వారిద్దరి మధ్య జరిగిన వాగ్వివాదం ఈ హత్యకు దారితీసింది.

నిందితుడు యోర్డానిస్‌ కోబోస్‌ మార్టినెజ్‌ (37)ను అరెస్టు చేసిన అధికారులు వివరాలు తెలిపారు. భారత సంతతికి చెందిన చంద్ర నాగమల్లయ్య( 50)ను మార్టినెజ్‌ క్రూరంగా హత్య చేసినట్టు చెప్పారు. (Dallas Motel)

ఏం జరిగింది?

శాముయెల్ బుల్వార్డ్‌లోని డౌన్‌టౌన్ స్యూట్స్ మోటల్ మేనేజర్‌గా చంద్ర నాగమల్లయ్య పని చేస్తున్నారు. మార్టినెజ్‌ కూడా డౌన్‌టౌన్ స్యూట్స్‌లోని ఉద్యోగే. పాడైపోయిన వాషింగ్ మెషీన్‌ను వాడవద్దని కోబోస్‌ మార్టినెజ్‌కు మరో సిబ్బందితో నాగమల్లయ్య చెప్పించారు.

Also Read: పాతబస్తీ ఘటనతో హైడ్రా చర్యలు.. మ్యాన్‌హోల్‌ తెరిచి ఉంటే ఈ నంబరుకు ఫోన్ చేయండి అంటూ..

నాగమల్లయ్య తనతో నేరుగా మాట్లాడకుండా ఆమె ద్వారా చెప్పించడం మార్టినెజ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. కొద్ది సేపటికి మార్టినెజ్ బయటికి వెళ్లి కత్తిని తీసుకొచ్చి చంద్ర నాగమల్లయ్యపై దాడి చేశాడు.

నాగమల్లయ్య కేకలు వేస్తూ పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆయనను మార్టినెజ్ వదలలేదు. ఆ సమయంలో మోటల్ ప్రాంగణంలోనే నాగమల్లయ్య భార్య, కుమారుడు ఉన్నారు. వారిద్దరూ అడ్డుకోవడానికి ప్రయత్నించినా మార్టినెజ్ వారిని తోసేసి దాడి కొనసాగించాడు.

ఈ ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ… “నాగమల్లయ్యను మోటెల్‌ ప్రాంగణంలోని ఓ గదినుంచి ఆఫీస్ వరకు మార్టినెజ్ వెంటాడాడు. నాగమల్లయ్య భార్య అరుస్తూ ఏడ్చింది. నేను ఆమెను వెనక్కి వెళ్లాలని చెప్పాను. ఆమెపై కూడా మార్టినెజ్ దాడి చేస్తాడేమోనని అనిపించింది” అని అన్నాడు.

అఫిడవిట్ ప్రకారం.. నాగమల్లయ్యపై దాడి చేసిన తర్వాత అతని మొబైల్‌ఫోన్‌, కీ కార్డును మార్టినెజ్ చోరీ చేశాడు. నాగమల్లయ్య తలను నరికి, దానిని పార్కింగ్‌ లాట్‌లో తన్నాడు. ఆ తర్వాత దాన్ని పట్టుకుని సమీపంలోని డంప్‌స్టర్‌లో పడేశాడు.

డల్లాస్‌ పోలీసులు మార్టినెజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను పోలీసు విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం డల్లాస్‌ కౌంటీ జైలులో కాపిటల్ మర్డర్‌ కేసులో రిమాండ్‌లో ఉన్నాడు. మార్టినెజ్‌కు గతంలోనూ నేర చరిత్ర ఉంది. ఫ్లోరిడాలో ఆటో చోరీ, హ్యూస్టన్‌లో దాడి, చిన్నారిపై అసభ్యకర ప్రవర్తన కేసుల్లో ఇంతకుముందు కూడా పలుసార్లు అతడు అరెస్టు అయ్యాడు.