Bill Hagerty: భారత సైనికులను కరిగించేందుకు విద్యుత్ అయస్కాంత ఆయుధాలు..! చైనాపై అమెరికా సెనెటర్ సంచలన ఆరోపణలు..

ఆ లోయలో అసలేం జరిగింది? భారత సైనికులపై చైనా చేసిన కుట్రలు ఏంటి? నాటి ఘర్షణ గురించి అమెరికా సెనెటర్ ఇప్పుడెందుకు ప్రస్తావించారు?

Bill Hagerty: భారత సైనికులను కరిగించేందుకు విద్యుత్ అయస్కాంత ఆయుధాలు..! చైనాపై అమెరికా సెనెటర్ సంచలన ఆరోపణలు..

Updated On : September 12, 2025 / 4:42 PM IST

Bill Hagerty: అమెరికా సుంకాల తర్వాత భారత్, చైనా మధ్య ఉద్రికత్తలు తొలగిపోతున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు మెరుగుపడుతున్నాయి. వాణిజ్య పరంగా అడుగులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా సెనెటర్ చైనాపై చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భారత సైనికులను కరిగించేందుకు చైనా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వెపన్స్ (విద్యుత్ అయస్కాంత ఆయుధాలు) వాడిందని అమెరికా సెనెటర్ బిల్ హాగెర్టీ ఆరోపించారు. ఐదేళ్ల కిందట సరిహద్దు ఘర్షణ సందర్భంగా చైనా ఆ ఆయుధాలను మోహరించిందని ఆయన తెలిపారు. పరోక్షంగా గల్వాన్‌ ఘర్షణను ప్రస్తావించారు అమెరికా సెనెటర్.

ఒకరిపై మరొకరికి నమ్మకం లేదు..

అంతేకాదు భారత్, చైనా సంబంధాలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా రెండు దేశాల మధ్య మంచి రిలేషన్స్ లేవన్నారు. ఒకరిపై మరొకరికి విశ్వాసం లేదన్నారు. అంతేకాదు ఐదేళ్ల క్రితం వివాదాస్పద సరిహద్దు దగ్గర ఘర్షణపడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో చైనా విద్యుదయస్కాంత ఆయుధాలను ఉపయోగించిందని బిల్ చెప్పారు.

అదే 2020. గల్వాన్‌ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. తమవైపు ఐదుగురు సైనికులు మరణించినట్లు చైనా తెలిపినా.. మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత రెండు దేశాల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.

ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు తొలగుతున్నాయి. సంబంధాలు కొంత బెటర్ అవుతున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ గతేడాది కీలక గస్తీ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.

భారత్, చైనాలను దగ్గర చేసిన ట్రంప్ టారిఫ్స్..!

అంతేకాదు.. కొన్ని రోజుల క్రితం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. SCO సమ్మిట్ లో పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కూడా అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల మోత వేళ ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, చైనా దగ్గరవడం అమెరికాకు ఊహించని షాక్ తగిలినట్లైంది. దీనిపై ట్రంప్ ఇప్పటికే పలుమార్లు తన అక్కసు వెళ్లగక్కారు. చైనా కారణంగా భారత్ ను కోల్పోయామన్నారు. అంతేకాదు జిత్తుల మారి చైనాకు ఇండియా దగ్గరవుతోందన్నారు. ఇప్పుడు సెనెటర్ బిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Also Read: అమెరికాలో భారత సంతతి వ్యక్తి తలను నరికేసిన తోటి ఉద్యోగి.. అక్కడితోనూ ఆగకుండా..