AI Made Minister: వాటే థాట్..! ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. ఏఐ మేడ్ మినిస్టర్ డియోల్లా.. ఎవరీ డియోల్లా, ఎందుకోసం రూపొందించారు..

ఏఐ మేడ్ మినిస్టర్ అసలు ఎలా పని చేస్తుంది? దీని ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా? తెలుసుకుందాం..

AI Made Minister: వాటే థాట్..! ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. ఏఐ మేడ్ మినిస్టర్ డియోల్లా.. ఎవరీ డియోల్లా, ఎందుకోసం రూపొందించారు..

Updated On : September 12, 2025 / 6:26 PM IST

AI Made Minister: ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మాటే వినిపిస్తోంది. ఏఐ.. అద్భుతాలు చేస్తోందని చెప్పాలి. అందుకే అన్ని రంగాల్లో ఏఐ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ వినియోగం నెక్ట్స్ లెవెల్ కి వెళ్లింది. యూరప్ కు చెందిన ఓ దేశం చేసిన పని ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఇంట్రస్టింగ్ గా మారింది.

ప్రతి రంగంలోనూ వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు(ఏఐ) ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించింది. అవినీతిని అరికట్టే పనిలో AI- జనరేటెడ్ మంత్రిని నియమించిన మొదటి దేశంగా అల్బేనియా నిలిచింది.

అవినీతి నిరోధానికి ప్రభుత్వం ఖతర్నాక్ ప్లాన్..

ఎవరూ ఊహించని రీతిలో ఏఐని వినూత్నంగా ఉపయోగిస్తోంది అల్బేనియా. అవినీతి నిరోధానికి ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ఏఐ ఆధారిత అసిస్టెంట్‌ డియెల్లాను క్యాబినెట్‌ మంత్రిగా నియమించింది. ఈ తరహా నియామకం ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్. అసలు ఏంటీ డియెల్లా? ఈ లేడీ మినిస్టర్ స్పెషాలిటీ ఏంటి? అల్బేనియా ఏఐని ఎలా వాడుకుంటోంది? తెలుసుకుందాం..

అల్బేనియని భాషలో డియెల్లాకు అర్థం సూర్యుడు. దేశ సంప్రదాయ దుస్తులు ధరించినట్టుగా ఈ వర్చువల్ మహిళా మంత్రిని డిజైన్ చేశారు. టెక్నాలజీ, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ఈ ఏఐ చాట్‌బాట్‌ను తీర్చిదిద్దారు. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విభాగ పర్యవేక్షణ కోసం ఈ లేడీ మినిస్టర్ ను నియమించారు.

ఈ విభాగంలో తీవ్రస్థాయిలో అవినీతి జరుగుతోందని ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరప్షన్ ను కట్టడి చేసేందుకు ఏఐని వాడుకుంటోంది. అంతేకాదు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా, పాలనా వ్యవస్థపై నమ్మకం పెరిగేలా దశలవారీగా ఈ తరహా సంస్కరణలు తీసుకొస్తామని అల్బేనియా ప్రధాని ఏడి రమా తెలిపారు.

పబ్లిక్ టెండర్ల పర్యవేక్షణకు ప్రపంచంలోనే మొట్టమొదటి AI జనరేటెడ్ ప్రభుత్వ మంత్రిని నియమించినట్లు ప్రధాని రమా ప్రకటించారు. దాని కృత్రిమ మేధస్సు ఈ ప్రక్రియను “అవినీతి రహితంగా” మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మేలో నిర్ణయాత్మక ఎన్నికల విజయం తర్వాత సోషలిస్ట్ పార్టీ సమావేశంలో తన కొత్త మంత్రివర్గాన్ని వెల్లడిస్తూ, కొత్త “సభ్యుడు” డీయెల్లాను పరిచయం చేశారు ప్రధాని రమా. భౌతికంగా హాజరు కాని, కృత్రిమ మేధస్సు ద్వారా సృష్టించబడిన మొదటి ప్రభుత్వ సభ్యుడు డియెల్లా అని ఆయన వెల్లడించారు.

పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు లేకుండా..

”ఏఐ ద్వారా అవినీతిపై పోరాటంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తాం. ఈ డియెల్లా.. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుంది. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షించనుంది. పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు లేకుండా టెండర్లను కేటాయించనుంది. పారదర్శకతతో పబ్లిక్ ఫండ్ కేటాయింపులు జరిగేలా చూడనుంది” అని ప్రధాని రమా వివరించారు.

మే లో జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలిచారు రమా. త్వరలో తన కొత్త మంత్రివర్గాన్ని పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. పబ్లిక్ టెండర్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలను డీయెల్లా నిర్వహిస్తారు. అవి 100 శాతం అవినీతి రహితంగా ఉంటాయి. టెండర్ విధానానికి సమర్పించబడిన ప్రతి పబ్లిక్ ఫండ్ పారదర్శకంగా ఉండేలా నిర్ధారిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

కాగా, ఈ ఏఐ మంత్రి నియామకంపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు సూపర్ అంటే.. మరికొందరు ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. ప్రభుత్వం దూరదృష్టిని కొందరు ప్రశంసించారు. మరికొందరేమో.. అల్బేనియా రాజకీయాల్లో ఏఐని ఏమార్చుతారని, డియెల్లా కూడా అవినీతి బారిన పడుతుందని విమర్శలు గుప్పించారు. ఇంకొందరు పలు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ ఏఐ మంత్రి నిర్ణయాలు ఆచరణలో ఎలా ఉంటాయో చూడాలంటున్నారు. అంతేకాదు వాటిని కోర్టులో సవాల్ చేయొచ్చా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Also Read: భారత సైనికులను కరిగించేందుకు విద్యుత్ అయస్కాంత ఆయుధాలు..! చైనాపై అమెరికా సెనెటర్ సంచలన ఆరోపణలు..