Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ముష్కర మూకలను మట్టుబెట్టింది. గతంలోనూ అనేకసార్లు పాక్ పై భారత్ సైనిక ఆపరేషన్లు చేసింది.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌పై ఉగ్రమూకలను ఉసిగొల్పుతోంది పాకిస్తాన్. వీటికి దీటుగా స్పందిస్తున్న భారత్.. ప్రతీకార దాడులతో బుద్ధి చెబుతున్నా పాక్ లో మార్పు రావడం లేదు. గత 70 ఏళ్లలో పాక్‌పై భారత్ చేపట్టిన కీలక సైనిక ఆపరేషన్ల గురించి తెలుసుకుందాం..
ఆపరేషన్ సిందూర్.. 2025
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. పదుల సంఖ్యలో ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది.
బాలాకోట్.. 2019
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలోని సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. 40 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. జైషే మహమ్మద్ ఈ దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారంగా బాలాకోట్‌లో జైషే ఉగ్ర స్థావరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన వైమానిక దాడులు చేసింది. 1971 యుద్ధం తర్వాత పాక్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం అదే తొలిసారి.
సర్జికల్ స్ట్రైక్స్.. 2016
2016 సెప్టెంబర్‌లో జమ్ముకశ్మీర్ ఉరిలోని భారత సైనిక స్థావరంపై మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. 19 మందిని చంపారు. ఆ ఘటన జరిగిన 10 రోజులకు పీవోకేలో ఉన్న ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారత్. అనేక మంది ఉగ్రవాదులను అంతం చేసింది.
కార్గిల్‌లో ‘ఆపరేషన్ విజయ్’.. 1999
1999 మే లో పాక్ సైన్యం అక్రమంగా కార్గిల్ సెక్టార్‌లోకి చొరబడింది. దీంతో భారత్ ఆపరేషన్ విజయ్ చేపట్టింది. భీకర యుద్ధం జరిగింది. జులై నాటికి ఆ భూభాగాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంది.
ఆపరేషన్ మేఘ్‌దూత్..
లద్దాఖ్‌లోని సియాచిన్ గ్లేసియర్‌లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ‘ఆపరేషన్ మేఘ్‌దూత్’ ను భారత్ చేపట్టింది. సాల్టోరో రిట్జ్‌పై పైచేయి సాధించిన భారత బలగాలు.. ఆ ప్రాంతంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేశాయి. అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్‌కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
Also Read: అమెరికా ఆపరేషన్ నెప్ట్యూన్ నుంచి భారత్ ఆపరేషన్ సిందూర్ వరకు.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన దేశాలు..
ఆపరేషన్ ట్రైడెంట్.. 1971
తూర్పు పాక్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న వేళ.. భారత్‌పై పాక్ దాడులకు తెగబడింది. ఇది కాస్త ఇరుదేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. అదే సమయంలో 1971 డిసెంబర్ 4న.. కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా భారత్ నౌకాదళం ‘ఆపరేషన్ ట్రైడెంట్’ చేపట్టింది. భారత్ క్షిపణి బోట్లు.. ఊహించని రీతిలో పాక్ నౌకాదళ ఆస్తులు, ఇంధన నిల్వలను ధ్వంసం చేశాయి. ఆ యుద్ధంలో భారత్ నౌకాదళం ఆధిపత్యం కనబరిచింది. చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఆ యుద్ధం ముగిసింది.
పాక్.. ఆపరేషన్ జిబ్రాల్టర్.. 1965
కశ్మీర్‌ను ఆక్రమించాలనుకునే ఉద్దేశంతో పాక్ సైన్యం 1965లో సైనిక చర్య చేపట్టింది. పాక్ సైనికులు, తిరుగుబాటుదారులు మారు వేషంలో కశ్మీర్‌లోకి చొరబడేందుకు చేపట్టిన కోవర్ట్ ఆపరేషన్ ఇది. దానికి ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరు పెట్టారు. దీనిని భారత్ సైన్యం దీటుగా తిప్పికొట్టింది. ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం జరిగింది. భారత్-పాక్ మధ్య రెండో అతి పెద్ద యుద్ధానికి దారితీసింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన కాల్పుల విరమణ, 1966లో తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఆ ఘర్షణకు ముగింపు పడింది.
భారత్-పాక్ తొలి యుద్ధం..
స్వాతంత్ర్యం పొందిన కొన్ని నెలలకే భారత్-పాక్ మధ్య ఘర్షణ ఏర్పడింది. దీన్నే మొదటి కశ్మీర్ యుద్ధంగా పేర్కొంటారు. పాక్ మద్దతున్న ట్రైబల్ మిలీషియా దళాలు కశ్మీర్‌ను ఆక్రమించాయి. ఆ సమయంలో అక్కడి మహారాజు భారత్‌లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు భారత్ బలగాలను అక్కడికి పంపించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. 1948 వరకు ఇది కొనసాగింది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఇరు దేశాలు కాల్పులు విరమించాయి. జమ్ముకశ్మీర్‌లో మూడింట రెండొంతుల భూభాగం భారత్ చేతికి రాగా.. మిగతా భాగం పాక్ నియంత్రణలో ఉండిపోయింది. దాన్నే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)గా పేర్కొంటున్నాం.