Operation Sindoor: అమెరికా ఆపరేషన్ నెప్ట్యూన్ నుంచి భారత్ ఆపరేషన్ సిందూర్ వరకు.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన దేశాలు..
ఒక భారత్ మాత్రమే కాదు.. గతంలో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు కూడా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించాయి.

Operation Sindoor: సీమాంతర ఉగ్రవాదం.. పలు దేశాలకు ఓ పెద్ద సమస్యగా మారింది. కొన్ని దేశాలు టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్నాయి. వారిని పెంచి పోషిస్తున్నాయి. తమ భూభాగంలో శిబిరాలను ఏర్పాటు చేసి మరీ ముష్కరులకు ఆశ్రయం ఇస్తున్నాయి. పొరుగు దేశాలపైకి వారిని ఉసిగొల్పుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఈ కోవలోకే వస్తుంది.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది భారత్. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పీవోకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ లోని 4, పీవోకేలోని 5 ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది.
పాక్ పౌరులకు హాని కలగకుండా ఉగ్రవాదులను ఖతం చేసింది. వారి శిబిరాలను నేలమట్టం చేసింది. ఒకసారి చరిత్ర చూస్తే.. అనేక దేశాలు తమ సరిహద్దులకు ఆవల ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి కార్యకలాపాలను నిర్వహించాయి. భారత్ మాత్రమే కాదు పలు దేశాలు సీమాంతర ఉగ్రవాదంతో ఇబ్బందిపడ్డాయి. అదను చూసి టెర్రరిస్టులను చావు దెబ్బకొట్టాయి. వాళ్ల భూభాగంలోకి వెళ్లి మరీ ముష్కరులను లేపేశాయి.
లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లతో అనుసంధానించబడిన శిబిరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి కారణమైన వారిని లక్ష్యంగా చేసుకుంది. ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కూల్చేసింది. పాకిస్తాన్ భూభాగంలో 100 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాలను పేల్చివేసింది. కాగా, పౌరుల ప్రాణనష్టాన్ని నివారించినట్లు సైనిక అధికారులు తేల్చి చెప్పారు.
ఒక భారత్ మాత్రమే కాదు.. గతంలో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు కూడా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించాయి. వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను ఖతం చేశాయి. ఓసారి చరిత్ర చూస్తే, అనేక దేశాలు తమ సరిహద్దులకు ఆవల ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి (ఆపరేషన్ సిందూర్) కార్యకలాపాలను నిర్వహించాయి.
US: ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ (2011)
మే 2, 2011న, అమెరికా ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ నిర్వహించింది. సీల్ టీం సిక్స్ పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లోని అతని కాంపౌండ్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను చంపింది. అల్-ఖైదా నాయకుడు, సెప్టెంబర్ 11 దాడుల ప్రధాన సూత్రధారి బిన్ లాడెన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో పాకిస్తాన్ అనుమతి లేకుండా పాకిస్తాన్ భూభాగంలో దాదాపు 120 మైళ్ళు (193 కిమీ) అమెరికా దళాలు చొచ్చుకెళ్లాయి.
US: ఆపరేషన్ ఇన్ఫినిట్ రీచ్ (1998)
1998 ఆగస్టు 20న అల్-ఖైదా స్థావరాలపై అమెరికా క్రూయిజ్ క్షిపణి దాడులకు ఆపరేషన్ ఇన్ఫినిట్ రీచ్ అనే కోడ్ పేరు పెట్టారు. కెన్యా, టాంజానియాలోని అమెరికన్ రాయబార కార్యాలయాలపై బాంబు దాడులకు ప్రతీకారంగా అమెరికా నావికాదళం సూడాన్‌లోని ఖార్టూమ్‌లోని అల్-షిఫా ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీని, ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులు అల్-ఖైదా ఉగ్రవాద దాడులకు మొదటి ప్రధాన అమెరికన్ ప్రతిస్పందనను సూచిస్తాయి.
ఇజ్రాయెల్: ఆపరేషన్ ఎంటెబ్బే (1976)
జూలై 3-4, 1976న, ఇజ్రాయెల్ కమాండోలు ఉగాండాలోని ఎంటెబ్బే విమానాశ్రయంలో బందీల రెస్క్యూ మిషన్ నిర్వహించారు. ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. అందులో 106 మంది ఇజ్రాయెల్, యూదు ప్రయాణికులను బందీ చేశారు. ఇజ్రాయెల్ రవాణా విమానాలు 100 మంది కమాండోలను ఉగాండాకు 4వేల కిలోమీటర్లకు పైగా ఎగరవేసి, 102 మంది బందీలను విజయవంతంగా రక్షించాయి. పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేసిన పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, జర్మన్ రివల్యూషనరీ సెల్స్ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ జరిగింది.
ఇజ్రాయెల్: ఆపరేషన్ స్ప్రింగ్ ఆఫ్ యూత్ (1973)
ఆపరేషన్ స్ప్రింగ్.. 1973 ఏప్రిల్ 9-10 తేదీలలో జరిగింది. ఈ ఆపరేషన్ ను స్ప్రింగ్ ఆఫ్ యూత్ అని పిలుస్తారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు బీరుట్ సిడాన్‌లోని అనేక పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ శిబిరాలపై దాడి చేశాయి. ఈ ఆపరేషన్ ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్ PLO అధికారులను లక్ష్యంగా చేసుకుంది- కమల్ అద్వాన్, మొహమ్మద్ యూసఫ్ నజ్జర్, కమల్ నాజర్. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ ఊచకోతకు ప్రతీకారంగా వీరిని లేపేశారు.
రష్యా: ఆపరేషన్ చెచన్యా, జార్జియా..
ఆగస్టు 2002లో, జార్జియాలోని పాంకిసి జార్జ్‌లోని చెచెన్ వేర్పాటువాద స్థావరాలపై రష్యా వరుస వైమానిక దాడులు నిర్వహించింది. జార్జియా.. చెచెన్ ఉగ్రవాదులను జార్జియన్ భూభాగంలోకి అనుమతించిందని రష్యా ఆరోపించింది.
కొలంబియా: ఆపరేషన్ ఫీనిక్స్ (2008)
ఆపరేషన్ ఫీనిక్స్.. కొలంబియన్ సైన్యం. మార్చి 1, 2008న ఈక్వెడార్‌లోని సుకుంబియోస్ ప్రావిన్స్‌లోని సరిహద్దు మీదుగా 1.8 కి.మీ దూరంలో ఉన్న కొలంబియా విప్లవాత్మక సాయుధ దళాల (FARC) శిబిరంపై దాడి చేసింది. ఈ ఆపరేషన్ FARC నాయకత్వ మండలిలో ఉన్నత స్థాయి సభ్యుడు రౌల్ రేయెస్‌ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని చంపింది. ఇది FARC సంస్థకు గణనీయమైన దెబ్బ. కొలంబియా, ఈక్వెడార్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది.