Afghanistan89
Taliban ఆగస్టు-15న కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ తాలిబన్ హస్తగతమైన తర్వాత ఆ దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక, తాలిబన్ పాలన మరియు ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడుల తర్వాత అప్ఘానిస్తాన్ వదిలి పారిపోయేందుకు ఎక్కువమంది ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అప్ఘానిస్తాన్ తాలిబన్ వశమైన తర్వాత ఆ దేశం వదిలి పారిపోయినవారి సంఖ్య 5లక్షల కన్నా ఎక్కువ ఉందని, అందులో మెజార్టీ మహిళలు, పిల్లలే ఉన్నారని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(UNHCR)ఆదివారం తెలిపింది. దేశంలో పెరిగిపోతున్న హింస, అభద్రతాభావం కారణంగా అఫ్ఘానిస్తాన్ పొరుగు దేశాలు తమ సరిహద్దులను తెరిచే ఉంచాలని యూఎన్‌హెచ్‌సీఆర్ కోరింది. ఇలా చేయడం వల్ల లెక్కలేనన్ని పౌరుల ప్రాణాలు కాపాడిన వాళ్లు అవుతారని అభిప్రాయపడింది. మరోవైపు యురోపియన్ దేశాల్లోని స్థానిక ఆఫ్ఘన్లు.. తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అఫ్ఘానిస్తాన్‌లో శాంతి మరియు స్థిరత్వం కోసం అంతర్జాతీయ సమాజం ముందుకురావాలని కోరుతూ నిరసనలు చేపట్టారు.
ఇక, అప్ఘానిస్తాన్ నుంచి నాటో దళాల తరలింపు గడువు దగ్గరపడుతుండడంతో పలువురు అప్ఘాన్ పౌరులు దేశం విడిచిపోయేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. దీంతో తాలిబన్లు ప్రజలు రాకుండా అడ్డుకొనేందుకు అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనంగా మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అప్ఘాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్ దళాలు కాబుల్ రహదారులపై పహారా కాస్తున్నారు. అమెరికా దళాలు వైదొలిగిన వెంటనే మొత్తం విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంటామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ఇప్పటికే చెప్పారు. తాలిబన్ల దిగ్బంధంతో విమానాశ్రయం వెలుపల ఇప్పటివరకు ఉన్న రద్దీ దృశ్యాలు కనుమరుగయ్యాయి. శనివారం విమానాశ్రయానికి వచ్చే రోడ్డుపై తాలిబన్లు కొన్ని వార్నింగ్‌షాట్లు పేల్చడంతో పాటు, హెచ్చరికగా స్మోక్ బాంబులను ప్రయోగించారు.
READ Afghanistan : మ్యూజిక్,టీవీ,రేడియో ఛానల్స్ లో మహిళల వాయిస్ బంద్