Yahya Sinwar
Israel Hamas War: : హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతమయ్యాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో సిన్వార్ మృతి చెందాడని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ధ్రువీకరించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాంట్జ్ తెలిపారు. తాజాగా ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ పుటేజిని విడుదల చేశాయి. ఈ వీడియోలో చనిపోయే ముందు సిన్వార్ కదలికలకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయగా.. గాజాలోని ఓ భవనంలో శిథిలమైన గోడల మధ్య సిన్వార్ సోఫాపై కూర్చొని ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. అతని కుడి చేయికి తీవ్రంగా గాయపడినట్లు కనిపించడంతోపాటు.. డ్రోన్ కెమెరా దగ్గరకు వెళ్లిన సమయంలో అతను ఓ కర్ర లాంటి వస్తువును విసిరివేయడం కనిపించింది.
Also Read: Yahya Sinwar: హమాస్ అగ్రనేత సిన్వార్ మృతిపై స్పందించిన అమెరికా.. బైడెన్, కమలా హారిస్ ఏమన్నారంటే?
ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ.. సిన్వార్ భవనంలో దాక్కున్నట్లు గుర్తించి.. భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. అది కూలిపోయి అతను చనిపోయాడు. సిన్వార్ వద్ద బుల్లెట్ ప్రూఫ్ చొక్కా, గ్రెనేడ్లు లభించాయని డేనియర్ హగారి తెలిపాడు. దాడి సమయంలో సిన్వార్ తప్పించుకునే ప్రయత్నం చేశాడని, కానీ, ఇజ్రాయెల్ దళాలు అతన్ని హతమార్చాయని అన్నారు. అయితే, సిన్వార్ మరణం విషయంపై హమాస్ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మరణంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. సిన్వార్ హత్య పాలస్తీనా భూభాగంలో ఏడాదిపాటు సాగుతున్న యుద్ధం ముగింపునకు ప్రారంభం అని చెప్పారు. సిన్వార్ ను అంతమొందించిన ఇజ్రాయెల్ సైన్యాన్ని నెతన్యాహు అభినందించారు. సిన్వార్ మరణంతో ఇజ్రాయెల్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు.. సిన్వర్ సోదరుడు మహమ్మద్, ఇతర హమాస్ మిలిటరీ కమాండర్ల జాడకోసం ఐడీఎఫ్ క్షుణ్ణంగా గాలిస్తుంది. హమాస్ ను పూర్తిగా అంతం చేస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే.
Raw footage of Yahya Sinwar’s last moments: pic.twitter.com/GJGDlu7bie
— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 17, 2024