Asian Games: కరోనా ఎఫెక్ట్.. వాయిదాపడ్డ ఏషియన్ గేమ్స్-2022

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ జీరో విధానాన్ని అమలు చేస్తోన్న...

Asian Games: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ జీరో విధానాన్ని అమలు చేస్తోన్న చైనా, పలు నగరాల్లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. షాంఘై, బీజింగ్‌తో పాటు పలు నగరాల్లో కఠినంగా కొవిడ్ ఆంక్షలు అమలవుతున్నాయి. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన ఏషియన్ గే్మ్స్ వాయిదా పడ్డాయి. ప్రత్యేకంగా కారణాలు ఏమీ చెప్పనప్పటికీ ఏషియన్ గేమ్స్‌కు ఆతిధ్య దేశమైన చైనా ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. క్రీడలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. కానీ క్రీడలు నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అక్కడి అధికారులు వెల్లడించారు.

ఆసియా క్రీడలు వాయిదా పడటం క్రీడాభిమానులకు నిరాశ కలిగించే విషయం. హాంగ్జూ పట్టణంలో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు ఏషియన్ గేమ్స్ జరగాల్సి ఉన్నాయి. ఈ పట్టణం చైనాలో ప్రస్తుతం కరోనాకు కేంద్రంగా ఉన్న షాంఘైకి సమీపంలోనే ఉంది. ఈ కారణంగా క్రీడల నిర్వహణ అనుకున్న సమయానికి సాధ్యం కాదని భావించిన చైనా ఆసియా క్రీడలను వాయిదా వేసినట్లు తెలిపింది. గత నెలలో ఏషియన్ గేమ్స్ నిర్వహణకు హాంగ్జూ సిద్ధంగా ఉన్నదని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం 56 స్టేడియాలను నిర్మించామని తెలిపింది. కానీ ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉండటంతో క్రీడల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది. షాంఘైతో పాటు దాదాపు అన్ని నగరాల్లో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో క్రీడలను వాయిదా వేస్తూ ప్రభుత్వం ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు