World Heart Day 2023
World Heart Day 2023 : ప్రపంచంలో ఎక్కువ మరణాలకు గుండె జబ్బులు, స్ట్రోక్‌లే ప్రధాన కారణమని వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ చెబుతోంది. ఏటా 17.1 మిలియన్ల మంది ఈ కారణాలతో చనిపోతున్నారు. క్యాన్సర్, HIV, AIDS, మలేరియా బాధితుల కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. గుండె జబ్బులు, స్ట్రోక్ నివారణపై అవగాహన కల్పించడానికి ఏటా సెప్టెంబర్ 29 న ‘వరల్డ్ హార్ట్ డే’ జరుపుతారు. ఈరోజు సెప్టెంబర్ 29.. గుండె జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
శారీరకంగా ఆరోగ్యంగానే ఉండి.. ఎటువంటి అనారోగ్యాలు లేని అతి చిన్న వయసు వారు కూడా ఇటీవల కాలంలో హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోయిన సంఘటనలను చూస్తున్నాం. గుండె కొట్టుకోవడానికి ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ సహాయపడుతుంది. లయను నియంత్రించేది ఇదే. ఈ వ్యవస్థ దెబ్బ తిన్నా గుండె ఆగిపోవచ్చు. రక్తనాళాల్లో పూడికల కారణంగాకూడా హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. కొన్ని మందుల ప్రభావం గుండెకు ప్రమాదకరం కావచ్చు.
Benefits of Makhanas : గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణలో మఖానాస్ తో కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు
కొందరు అసలు వ్యాయామం చేయరు. కొందరు అతిగా వ్యాయామం చేస్తారు. తీవ్రమైన శారీరక శ్రమ, ఆటల కారణంగా కూడా గుండె విద్యుత్ వ్యవస్థ విఫలం అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని కొన్ని భాగాల్లో ఏర్పడ్డ గడ్డలు గుండె రక్త నాళాలకు చేరుకోవడంతో కూడా గుండె ఆగిపోవచ్చు. ఖనిజ లవణాల లోపం లేదా పొగ తాగడం, గుట్కా నమలడం, కొన్ని మాదక ద్రవ్యాలను వాడేవారిలో కూడా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
కోవిడ్ 19 ని గుండె జబ్బులతో ముడివేస్తూ ఇటీవల చాలామంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి గుండె జబ్బుతో ఉండి కోవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందట. గుండెని ఆరోగ్యంగా కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరచుకుంటే గుండె పదిలంగా ఉంటుంది. కూరగాయలు, పొట్టు ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వారంలో కనీసం 150 నిముషాల నడక మంచిది. ఇలా చేయడం ద్వారా బీపీ, సుగర్, కంట్రోల్‌లో ఉంటాయి. కొవ్వు పదార్ధాలు, వేపుళ్లు వంటివి తగ్గించుకుని తినడం మంచిది.
Heart Health : రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలు.. గుండె ఆరోగ్యం భేష్
వరల్డ్ హార్ట్ డే రోజు గుండె జబ్బులు మరియు అనారోగ్యాలపై అవగాహన కల్పిస్తారు. కొన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్‌లలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పాల్గొంటాయి. సైన్స్ ఫెయిర్‌లు, ప్రదర్శనలు, ఫిట్‌నెస్ సెషన్స్, పబ్లిక్ టాక్‌లు, మారథాన్‌లు చేస్తారు. గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, శారీరక వ్యాయామాల్లో పాల్గొనడం, క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్, బీపీ, సుగర్ వంటికి చెక్ చేయించుకోవడం ఎంతో అవసరం.