దుబాయ్‌ లో దంచికొడుతున్న వర్షాలు : విమాన సర్వీసులు బంద్

దుబాయ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. విమానాశ్రయాల్లో భారీగా నీళ్లు చేరాయి. దీంతో అధికారులు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.

  • Publish Date - January 12, 2020 / 03:25 AM IST

దుబాయ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. విమానాశ్రయాల్లో భారీగా నీళ్లు చేరాయి. దీంతో అధికారులు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.

దుబాయ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో దుబాయ్‌ అతలాకుతలమవుతోంది. నగరంలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేని వర్షంలో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని బ్రిడ్జ్‌లు సైతం వర్షపు నీటిలో మునిగిపోయాయి. రోడ్లన్ని చెరువులను తలపిస్తుండటంతో జన జీవనం స్తంభించిపోయింది.

భారీగా వర్షాలు కురుస్తుండటంతో జనాలు బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ట్రైన్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అక్కడి విమానాశ్రయాల్లో భారీగా నీళ్లు చేరాయి. దీంతో అధికారులు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. దుబాయ్‌కు తన విమాన సర్వీసులను ఎయిర్‌ ఇండియా (ఏఐ) రద్దు చేసింది. ముంబై, ఢిల్లీ, చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్లే విమానాలను రద్దు చేశామని ఏఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

కాలికట్‌ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని అల్‌ మఖ్తుమ్‌ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టుకు మళ్లించారు. అలాగే శంషాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లే ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేశారు. శంషాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లే మరో మూడు విమానాలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు.