Afghanistan : అందమైన అఫ్గాన్ లో కల్లోలం రేపిందెవరు?

అందమైన అఫ్గానిస్తాన్ లో బాంబుల మోతలు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మహిళలు ఇళ్లలోంచి బయటకు వెళ్లే దైర్యం కూడా చేయడం లేదు

Afghanistan

Afghanistan : అఫ్గానిస్తాన్‌ లో తాలిబన్లు రక్తపుటేరులు పారిస్తున్నారు. వారికి ఎదురు తిరిగిన వారిని దారుణంగా హతమార్చుతున్నారు. తమకు అడ్డు చెప్పేవారే లేరన్నట్లు తాలిబన్లు ప్రవర్తిస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ విషయంలో పట్టీపట్టణాలు వ్యవహరిస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేకపోవడంతో కేవలం 45 రోజుల సమయంలో దేశం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రావిన్సులను స్వాధీనం చేసుకునే సమయంలో అనేకమందిపై దాడులు చేశారు. అరాచకం సృష్టించారు ఉగ్రవాదులు. వీరికి బయపడి మహిళలు ఇళ్లలోంచి బయటకు కూడా రావడం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటూ క్రమంగా రాజధాని వైపు కదిలి ఆదివారం కాబూల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అబ్దుల్ ఘనీ రాజీనామా చేశారు.

తాలిబన్లు దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని ముందే అర్ధం చేసుకున్న ఆ దేశ ఆర్ధిక మంత్రి కొద్దీ రోజుల క్రితం దేశం విడిచి పారిపోయారు. ఇక ఇతర దేశాల ఎంబసీలు కూడా నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయి. అమెరికా ఇప్పటికే తమ రాయబార కార్యాలయాన్ని సర్దేసింది. ఇక భారత్ కూడా అక్కడ ఉండే భారతీయులు వెనక్కు రావాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం ఎయిర్ ఇండియా విమానం సుమారు 150 మందిని తీసుకోని ఇండియాకు వచ్చింది..

ఎవరి తాలిబన్లు

‘తాలిబ్‌’ అంటే పష్తో భాషలో విద్యార్థి అని అర్థం. పాక్‌ మదర్సాల్లో చదువుకునే స్టూడెంట్‌ మిలీషియా తాలిబన్లుగా రూపాంతరం చెందింది. తమ పాలనలో ఉన్న ప్రాంతాల్లో కఠినమైన ఇస్లామిక్‌ షరియా చట్టం అమలు చేయడం, తమ భూభాగాలపై పాశ్చాత్య బలగాలను తరిమికొట్టడం వీరి ప్రాథమిక లక్ష్యాలు.

అఫ్గానిస్తాన్‌ చరిత్ర

అఫ్గానిస్తాన్‌ ప్రాంతంలో మానవ నివాసం ప్రాచీన శిలా యుగం నాటి నుంచి ఉంది. సింధు నాగరికత ఈ ప్రాంతంలో ప్రబలిందనేందుకు షోర్తుగై ప్రాంతంలో తవ్వకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పురాణాల్లో సువాసన భూమిగా ప్రశస్తి.. గాంధార అని కూడా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. హిమాలయ పర్వత సోయగాలకు, పరిమళ పూల మొక్కల ఎదుగుదలకు ఈ ప్రాంతం అనువైనది. అప్పట్లో రాజదర్బారులలో వాడే సెంట్లలో ఇక్కడ పూలనే వాడేవారు. గాంధార రాజ్య పతనానంతరం జొరాష్ట్రియన్‌ మతం ఇక్కడ విస్తరించింది. ఆ కాలంలో దీన్ని అరియానా అని పిలిచేవారు.

తర్వాత కాలంలో మౌర్యులు, కుషాణులు, మంగోలులు, అరబ్బులు, బ్రిటిష్‌వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. అరబ్బుల దండయాత్రల అనంతరం ఇతర మతాలు దాదాపు క్షీణించి ముస్లింల ప్రాబల్యం పెరిగింది. జొరాస్ట్రియన్ మతం క్షిణించి పోయింది. ఆధునికయుగంలో 1747లో అహ్మద్‌ షా దురానీ తొలిసారి కాందహార్‌ రాజధానిగా అఫ్గాన్‌ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. 1776లో రాజధాని కాబూల్‌కు మారింది. తొలి ఆంగ్లో అఫ్గాన్‌ యుద్ధానంతరం ఈ ప్రాంతం కొంతకాలం బ్రిటీష్‌ పాలనలో ఉంది.

బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొందిన తర్వాత రాచరిక పాలనలోకి వెళ్ళింది అఫ్గాన్.. 1973లో జహీర్‌షాపై జరిగిన తిరుగుబాటు అనంతరం రిపబ్లిక్‌గా మారింది. 1978 తిరుగుబాటు తర్వాత సోషలిస్టు రాజ్యం రూపాంతరం చెందింది. కానీ తిరుగుబాట్లు అధికం కావడం, రష్యాతో ముజాహిద్దీన్ల యుద్ధంతో అస్థిరత నెలకొంది. 1994 వరకు దేశంలో పరిపాలన సక్రమంగానే సాగింది.

ఆ తర్వాత ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్‌ను ను తన స్వాధీనం చేసుకున్నారు. 2001 వరకు అఫ్గానిస్తాన్‌ను పాలించారు. 2001లో అమెరికా ట్రేడ్ సెంటర్ పై దాడి తర్వాత తాలిబన్ల ఊచకోత మొదలైంది. అమెరికా బలగాలు అఫ్గానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకోని ఊచకోత కోశాయి. అమెరికా సాయంలో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. అమెరికా దాడులను తట్టుకోలేని తాలిబన్లు దేశాన్ని విడిచి వెళ్లారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో తలదాచుకున్నారు.

2021 లో అమెరికా దళాలు వెనుదిరుగుతున్నాయని ప్రకటించడంతో తాలిబన్లు కోరలు చచ్చారు. మారణహోమం మొదలు పెట్టారు. చేత ఆయుధాలు పట్టి దాడులు మొదలు పెట్టారు. అడ్డు వచ్చిన వారి ప్రాణాలు తీస్తూ దేశంలోని 34 ప్రావిన్సులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్లు రాజధాని కాబూల్ లోకి ప్రవేశించడంతో అధ్యక్షుడు రాజీనామా చేసి వేరే దేశానికి పారిపోయారు.

ఇక ఆ దేశంలో ప్రస్తుతం భయానక వాతావరణం ఉంది. ఆడవారు ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు. పనులు దొరక్క.. తిండిలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. పేద దేశంలో ఇలాంటి విపత్కర పరిణామాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.