×
Ad

30ఏళ్లలో అత్యంత ఘోర ప్రమాదం.. 44 మందికిపైగా మృతి.. వందల మంది మిస్సింగ్.. ప్రమాదానికి కారణం ఇదే..

Hong Kong Fire Tragedy సమీపంలోని భవనాలను పోలీసులు ఖాళీ చేయించారు. చాలా రోడ్లు మూసివేశామని, 30కిపైగా బస్సు రూట్లు మళ్లించడం జరిగిందని..

Hong Kong Fire Tragedy

Hong Kong Fire Tragedy : హాంకాంగ్‌లోని థాయ్ పో ప్రాంతంలోని హంగ్ ఫుక్‌కోర్టు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హాంకాంగ్ చరిత్రలో 30సంవత్సరాల్లో అత్యంత ఘోరమైన ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. మరో 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. సుమారు 270మంది ఆచూకీ ఇంకా లభించలేదు.

Also Read: అద్భుతం.. మహాద్భుతం.. ఏకంగా 6 నిమిషాల 23 క్షణాల పాటు సూర్యగ్రహణం.. ఎప్పుడంటే?

థాయ్ పో జిల్లాలోని ఆకాశహర్మ్యాల్లో బుధవారం మంటల చెలరేగాయి. ఆ నివాస సముదాయంలో 2వేల ఇళ్లు ఉన్నాయి. అందులో కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయని తెలిసింది. మొత్తం ఏడు అపార్టుమెంట్లలో 4,800 మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్నిప్రమాదంతో 700మందిని తాత్కాలిక నివాసాలకు తరలించారు. ఇది లెవల్ ఫైవ్ అగ్నిప్రమాదంగా గుర్తించారు. హాంకాంగ్‌లో అత్యంత తీవ్రప్రమాదాలను లెవల్ ఫైవ్‌గా పరిగణిస్తారు.

బుధవారం మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. మొదటి అత్యవసర కాల్ 3.34 గంటల సమయంలో వచ్చింది. భవనాలు దగ్గరదగ్గరగా ఉండడంతో మంటలు ఇతర భవనాలకు వేగంగా వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 128 ఫైరింజన్లతో సహాయ చర్యలు చేపట్టగా.. 57అంబులెన్సులు ఘటనా స్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయంకు మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే, భారీ సంఖ్యలో ప్రజల ఆచూకీ లభించలేదు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది. మరమ్మతు పనుల కోసం భవనాల బయట కట్టిన వెదురుబొంగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ హౌసింగ్ ఎస్టేట్‌లో ఉన్న మొత్తం 8 భవనాల్లో ఏడు భవనాలపై ప్రభావం ఉందని థైపో జిల్లా కౌన్సిలర్ ముయ్ సియూ ఫంగ్ చెప్పారు.

సమీపంలోని భవనాలను పోలీసులు ఖాళీ చేయించారు. చాలా రోడ్లు మూసివేశామని, 30కిపైగా బస్సు రూట్లు మళ్లించడం జరిగిందని హాంకాంగ్ రవాణా విభాగం ప్రకటించింది.