కరోనా వైరస్‌తో వూహన్‌లో ఆస్పత్రి డైరెక్టర్ మృతి

  • Publish Date - February 18, 2020 / 07:56 AM IST

కరోనా వైరస్ రక్కసికి హాస్పిటల్ డైరెక్టర్ బలైపోయారు. చైనా కేంద్ర నగరమైన వుహాన్ లోని ఓ హాస్పిటల్ డైరెక్టర్ కూడా ఈ వైరస్‌తో కన్నుమూశారు. మంగళవారం నాడు.. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియు ఝిమింగ్ మంగళవారం (ఫిబ్రవరి 18, 2020) 10.30 గంటలకు కరోనా వైరస్‌తో మృతి చెందినట్లు చైనా మీడియా వర్గాలు తెలిపాయి. ఉచాంగ్ హాస్పిటల్ కు ఝిమింగ్ తొలి డైరెక్టర్. ఇలా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు, డైరెక్టర్‌లే కరోనాతో చనిపోతున్నారంటే.. దాని తీవ్రత ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. 

కాగా.. కరోనాను కనుగొన్న వైద్యుడు ఈ వైరస్ భారీన పడి చైనాలోని వూహాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. చైనా ప్రజలు ఈ వైరస్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు రోజురోజుకూ ఈ వైరస్ భారీన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో చైనా ప్రజలు హడలిపోతున్నారు.

ఇప్పటి వరకూ 1868 మంది ప్రాణాలు కోల్పోగా.. 72 వేల మంది కోవిడ్ భారీన పడ్డారని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ వైరస్‌ను కనుగొన్న.. ఈ కరోనా భారీన పడిన వారికి చికిత్స చేస్తున్న వైద్యులకు కూడా సోకడంతో వారు కూడా మృత్యువాత పడుతున్నారు. దీంతో చైనా వ్యాప్తంగా ఆంక్షలు విధించడం జరిగింది. అంతేకాదు.. అత్యవసరం అయితే తప్ప బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.