కరోనా వైరస్ కట్టడి చేయడమే కాదు… ప్రపంచదేశాల ముందు అంతకంటే పెద్ద సవాలే ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరిస్తోంది. లాక్‌డౌన్లతో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయని.. ఇది చరిత్రలోనే కనివినీ ఎరుగని ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుందని ప్రకటించింది. అంతేకాదు.. కరోనాని కట్టడి చేసినా కూడా.. ఆర్ధిక సంక్షోభం నుంచి కోలుకోవడం మాత్రం అంత సులభం కాదని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా ఏ ఒక్క దేశమో కాదూ..మొత్తం ప్రపంచమే అధోగతి పాలు కాబోతోందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్.. ఐఎంఎఫ్ డైరక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. ఈ స్థాయి సంక్షోభాన్ని ఇప్పుడున్నవాళ్లెవరూ చూడలేదని..1929-30నాటి గ్రేట్ డిప్రెషన్‌నాటి స్థాయి అంటూ చెప్పారామె. ప్రపంచదేశాల్లోని 170 దేశాల తలసరి ఆదాయం ఇప్పటికే మైనస్‌లోకి వెళ్లిపోయిందంటూ ఆమె చెప్పిన వైనం అన్ని దేశాల్లో వణుకు పుట్టిస్తోంది..1929 సమయంలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం నెలకొనగా..అమెరికా వాల్ స్ట్రీట్ పూర్తిగా కుప్పకూలింది.
170 దేశాల్లో తలసరి ఆదాయం పతనం :
కరోనాని కట్టడి చేయడంలో దేశాలు లాక్‌డౌన్ పట్టడం తప్పనిసరే..కానీ ఇదే సమయంలో వందలకోట్లమందిపై ఆర్ధికంగా భారం పడుతుందని చెప్పారు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరక్టర్ క్రిస్టాలినా… 2020లోనే ప్రపంచ వృద్ధి రేటు నెగటివ్ లోకి వెళ్లిపోతుందని, 170 దేశాల్లో తలసరి ఆదాయం పతనం కావడమే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు…ఈ కఠినమైన భయంకర వాస్తవాల నేపధ్యంలో వచ్చే వారం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ జాయింట్ మీటింగ్ జరగబోతోంది. (కరోనా నుంచి కోలుకుని… హాస్పిటల్ నుంచి బ్రిటన్ ప్రధాని డిశ్చార్జ్)
అది కూడా వర్చువల్ పద్దతిలో… కరోనా వైరస్ ప్రభావం ఈ ఏడాదిలోనే తగ్గినా… ఆ ప్రకంపనలు మాత్రం వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయని ఐఎంఎఫ్ హెచ్చరించింది.. కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఈ భారీ ప్రమాదం నుంచి కోలుకుంటాయని అంచనా వేసింది…అసలు కరోనా వైరస్ ఈ ఏడాది చివరికి కానీ పూర్తిగా అంతరించే సంకేతాలున్న దశలో పరిస్థితి రాను రాను ఇంకెంత ప్రమాదంగా మారుతుందో కూడా ఊహించలేని పరిస్థితులు నెలకొన్నాయ్. ఈ నేపధ్యంలోనే ఐఎంఎఫ్ మోగించిన డేంజర్ సిగ్నల్స్ మరింత భయపెడుతున్నాయ్.
మైనస్ గ్రోత్ రేటు తప్పదా? :
కొవిడ్-19 వైరస్ దెబ్బకి ఆ దేశం లేదు.. ఈ దేశం లేదు..రిచ్ కంట్రీ..పూర్ కంట్రీ తేడాల్లేవ్.. ప్రతి ఆర్ధిక వ్యవస్థా దెబ్బతినడం ఖాయంగా IMF చెప్తోంది.. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో వేసిన అంచనాలోనే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు 3.3శాతం. కానీ కరోనా ప్రవేశం తర్వాత పరిస్థితి పూర్తిగా తిరగబడి పోయింది…చివరికి ఉన్న వృద్ధి కూడా మాయమైపోయి.. మైనస్ గ్రోత్ రేటు నమోదైనా ఆశ్చర్యపడక్కర్లేదు.. ఇదే విషయాన్ని IMF హెచ్చరిస్తోంది.
ఇందుకోసం విపత్కర పరిస్థితుల్లో ప్రతి దేశంలోని ప్రభుత్వాలు.. తమ పౌరులకు…వ్యాపారాలు తిరిగి కోలుకునేదాకా పూర్తి స్థాయిలో అండగా నిలవడం ఒక్కటే పరిష్కారమార్గమని సూచించారు క్రిస్టాలినా. ఇప్పటికే పలు దేశాలు దాదాపు 8 లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్యాకేజీలను ప్రకటించడాన్ని ఆమె గుర్తుచేశారు. అలానే ఈ సాయం రానున్న రోజుల్లో ఇంకా పెరగాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు..ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంపై అల్లాడిపోతున్న దేశాలు…ఐఎంఎఫ్ తాజా హెచ్చరికలతో మరింత ఆందోళనకు గురవుతున్నాయ్.