Hyderabad Girl Appointed Brics Brand Ambassador
Hyderabad Girl Appointed BRICS Brand Ambassador : మన హైదరాబాద్ అమ్మాయి సృష్టి జూపుడి అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సృష్టి వాణిజ్య ప్రోత్సాహక అంతర్జాతీయ సంస్థ బ్రిక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ(సీసీఐ) అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్ (2021–22)గా హైదరాబాద్‌కు చెందిన సృష్టి జూపూడి నియమితులయ్యారు.
ఈ నియామకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని సదరు సంస్థ ప్రకటించింది. సృష్టి జూపూడి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాదేశాల్లో ఎంఎస్‌ఎంఈ రంగంలోని వ్యాపారాలు, యువ, మహిళా వ్యాపారవేత్తలు, అంకుర సంస్థల ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారని సంస్థ తెలిపింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన సృష్టి జూపూడి పలు జాతీయ, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొన్నారు.
వర్తక, వాణిజ్య అంశాలు, అభివృద్ధి సహాయ సహకారాలే ప్రధాన ఎజెండాగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమిని బ్రిక్స్ అని పిలుస్తారనే విషయం తెలిసిందే. బ్రిక్స్ మాతృసంస్థ సీసీఐ (చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్). ఇది బ్రిక్స్ సభ్య దేశాల్లోని యువతను ప్రోత్సహిస్తూ వారిని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందిస్తుంటుంది.
ప్రస్తుతం సీసీఐ ప్రపంచ ప్రచారకర్తగా హైదరాబాద్ యువతి అయిన ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సృష్టి జూపుడి సెలెక్ట్ కావటం తెలంగాణాకే కాదు తెలుగువారికందరికీ గర్వకారణమని చెప్పాలి. సంవత్సరం పాటు సృష్టి ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని పొందిన సందర్భంగా సృష్టి మాట్లాడుతూ.. యువ పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తి నింపేందుకు, బ్రిక్స్ చేపడుతున్న కార్యక్రమాలను యువ పారిశ్రామికవేత్త చేరేలా కృషి చేస్తానని తెలిపారు. సృష్టి ఎంపికపై క్రీడాకారులు, నగరంలోని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.