సరిహద్దుల్లో మళ్లీ కవ్విస్తున్న చైనా.. డ్రాగన్ దూకుడుతో వార్ తప్పదా ?

  • Publish Date - September 8, 2020 / 07:56 PM IST

ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నది ఏదైనా ఉందంటే.. అది కరోనా మాత్రమే. కానీ.. దానిని మించిన కరోడా చైనా. ఎస్.. డ్రాగన్ కంట్రీ ఎంత డేంజర్ అంటే.. అది కరోనా కంటే ప్రమాదకరం. కరోనా సోకితే.. 2, 3 వారాల్లో పోతుంది. కానీ.. చైనా ఒకసారి ఎంటరైతే.. ఎప్పుడు పోతుందో దానికి కూడా తెలియదు. ఇప్పుడు.. భారత సరిహద్దుల్లో జరుగుతున్నది కూడా ఇదే.

బోర్డర్‌లో రోజురోజుకు.. చైనా కవ్వింపులు పెరుగుతున్న వేళ.. ఒక్క విషయం మాత్రం క్లియర్ అయిపోయింది. ఎస్.. చైనా యుద్ధం కోరుకుంటోంది. అందుకే.. ఇండియాను రెచ్చగొడుతోంది. అతి త్వరలోనే.. ఇండో-చైనా సరిహద్దుల్లో మళ్లీ యుద్ధం చూడబోతున్నామా?



చైనీస్ ఆర్మీ కవ్వింపులతో.. ఇండో-చైనా బోర్డర్‌లో టెంపరేచర్ మళ్లీ పెరిగింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. పదే పదే కవ్వింపులకు దిగుతోంది. దశాబ్దాల తర్వాత.. సరిహద్దుల్లో తొలిసారి కాల్పులు చోటు చేసుకున్నాయ్. అఖండ భారత్‌‌ని భయపెట్టేందుకు.. డ్రాగన్ కుయుక్తులు పన్నుతోంది. చైనా కవ్వింపులతో.. సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రంగానే ఉందని చెబుతోంది ఇండియన్ ఆర్మీ. మరి.. చైనా దూకుడుతో యుద్ధం తప్పదా?

చైనా.. భారత్‌ను కావాలనే రెచ్చగొడుతోందా? :
ఇండో-చైనా బోర్డర్‌లో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సాక్షిగా.. చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. యుద్ధం కోసం పదే.. పదే.. ఇండియాను కవ్విస్తోంది. తన దురుసు వైఖరితో.. భారత్‌ను రెచ్చగొడుతోంది. ఇండియాకు హెచ్చరికలు జారీ చేస్తూ.. తన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో.. తన వైఖరికి పొంతన లేని వ్యాఖ్యలు చేస్తోంది డ్రాగన్ కంట్రీ. కొన్ని దశాబ్దాలుగా.. భారత్-చైనా సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు.

దాదాపు 45 సంవత్సరాల తర్వాత.. ఇండో-చైనా బోర్డర్‌లో తొలిసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. జూన్ 15న గల్వాన్ వ్యాలీలో.. భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగినప్పటికీ.. తుపాకులు మాత్రం వాడలేదు. ఈ ఘర్షణలో.. 20 మంది భారత వీరజవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. తాజాగా.. చషుల్ సెక్టార్‌లో గాల్లోకి కాల్పులు జరిపి.. మళ్లీ ఇండియాపైనే అబద్ధపు ప్రచారానికి దిగింది చైనా.



సరిహద్దుల్లో పదే పదే కవ్విస్తూ.. ఇండియాని యుద్ధానికి ప్రేరేపిస్తూ.. భారత్‌తో తాము ఏమాత్రం యుద్ధం కోరుకోవడం లేదంటూ.. కుయుక్తులు ప్రదర్శిస్తోంది చైనా. తమ మంచితనాన్ని అడ్డంగా పెట్టుకొని.. హెచ్చరిక కాల్పులకు పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ.. వార్నింగ్ ఇచ్చేందుకు ట్రై చేసింది. సరిహద్దుల్లో భారత సైనికులు హద్దులు మీరుతున్నారని.. చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని డ్రాగన్ కంట్రీ చెబుతోంది.

అయినప్పటికీ.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని చెప్పింది చైనా. ఇండో-చైనా బోర్డర్‌లో.. భారత బలగాలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటాయంటూ.. చైనీస్ ఆర్మీ ఆరోపిస్తోంది. డ్రాగన్ సైనికులపై.. ఇండియన్ ఆర్మీ వార్నింగ్ ఫైరింగ్‌కు పాల్పడిందంటూ.. అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. భారత్ చర్యలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా ఉందంటూ.. కవర్ చేస్తోంది. సరిహద్దుల్లో.. చైనా చేసే పనులన్నింటిని.. భారత్‌పైకి తోసే ప్రయత్నం చేసింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.

డ్రాగన్ కంట్రీ.. ఇండియాతో యుద్ధమే కోరుకుంటోందా? :
చైనా వాదనను.. ఇండియన్ ఆర్మీ తీవ్రంగా ఖండించింది. భారత బలగాలు గాల్లోకి ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేసింది. మన సైనికులెవరూ.. ఎల్ఏసీ దగ్గర అతిక్రమణకు పాల్పడలేదని వివరించింది. చైనా ముందు నుంచి అనుసరిస్తున్న దురుసు వైఖరిని మానుకోవాలని సూచించింది. ఎల్ఏసీ దగ్గర.. చైనా సైన్యమే గాల్లోకి కాల్పులు జరిపిందని.. అయినప్పటికీ భారత సైన్యం ఎంతో నేర్పుతో సహనం వహించిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. భారత్‌-చైనా సరిహద్దుల్లో.. తూర్పు లద్దాఖ్‌కు సమీపంలో గాల్లోకి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో.. అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.



దీంతో.. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న టెన్షన్ వాతావరణాన్ని తగ్గించేందుకు సంప్రదింపులు, చర్చలకు భారత్ కట్టుబడి ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ సమయంలోనే చైనా బలగాలు రెచ్చగొట్టే చర్యలతో పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని.. మన ఆర్మీ తెలిపింది. చైనా ఎంత కవ్వించినా భారత్‌ సమయమనం పాటిస్తోందని.. ఇలాంటి టైంలో ఇండియన్ ఆర్మీ ఎల్ఏసీ వెంట అతిక్రమణకు పాల్పడలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. కాల్పల వంటి చర్యలకు ఇండియన్ ఆర్మీ దిగలేదని తెలియజేశారు.

బోర్డర్‌లో చైనా దూకుడు ఏం చెబుతోంది? :
తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దగ్గర.. సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తగ్గించేందుకు సైనిక, దౌత్య, రాజకీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి టైంలోనే.. చైనా సైన్యం ఒప్పందాలను నిర్లక్ష్యంగా ఉల్లంఘిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిగిన ఘటనలో.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యాన్ని బెదిరించే ధోరణితో.. గాల్లో కాల్పులకు తెగబడ్డాయి. కానీ.. ఇండియన్ ఆర్మీ చైనా సేనలను తిప్పికొట్టాయి.



సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే.. ప్రపంచానికి మాత్రం డ్రాగన్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. చైనా సేనలు ఎంత కవ్వించినా.. ఎన్ని రెచ్చగొట్టే చర్యలు చేపట్టినా.. భారత సైన్యం మాత్రం సంయమనం పాటించి శాంతి మార్గంలోనే ఉందని.. ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఐతే.. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో.. వెనక్కి తగ్గేది లేదని భారత రక్షణశాఖ మరోసారి స్పష్టం చేసింది.