Donald Trump, Nicolas Maduro, Modi (Image Credit To Original Source)
Venezuela: వెనెజువెలాపై దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా అదుపులోకి తీసుకోవడంపై భారత్ స్పందించింది.
“వెనెజువెలాలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకరం. మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం” అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరింది.
వెనెజువెలా ప్రజల భద్రత, సంక్షేమం విషయంలో భారత్ తన మద్దతును మరోసారి స్పష్టంగా తెలియజేస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది. చర్చల ద్వారా సమస్యలకు శాంతియుత పరిష్కారాన్ని సాధిస్తూ ఆ ప్రాంత శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించాలని సంబంధిత వర్గాలను కోరుతున్నామని చెప్పింది.
Also Read: డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు
మరోవైపు, వెనెజువెలా రాజధాని కారకస్‌లోని భారత దౌత్య కార్యాలయం అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. అవసరమైన సాయాన్ని అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, వెనెజువెలాలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి అనవసర ప్రయాణాలు మానుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం భారత పౌరులకు సూచించింది. ప్రస్తుతం వెనెజువెలాలో ఉన్న భారతీయులు జాగ్రత్తలు పాటించాలని, ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని చెప్పింది. కారకస్ భారత దౌత్య కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కోరింది.