Rewind 2025: కొన్ని రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. కొత్త ఏడాదిలోనైనా ప్రపంచంలో ఏ యుద్ధాలు జరగకూడదని, ఏ సంక్షోభమూ రాకూడదని కోరుకుందాం. 2025 సంవత్సరంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణ సహా ప్రపంచంలో పలు యుద్ధాలు జరిగాయి. ఈ ఘర్షణలు, యుద్ధాలు ప్రపంచ భద్రతా పరిస్థితుల గురించి మరోసారి ఆలోచించేలా చేశాయి.
అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా 2025లో ఘర్షణకు దిగడం కలకలం రేపింది. ముఖ్యంగా 5 ఘర్షణల గురించి చెప్పుకోవచ్చు.
భారత్-పాకిస్థాన్ ఘర్షణ (మే 7-10)
భారత్-పాకిస్థాన్ మధ్య 2025 మేలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. జమ్మూకశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారత పౌరులు మృతి చెందడంతో ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ కూడా ప్రతిదాడులు చేపట్టింది. నాలుగు రోజుల పాటు ఉద్రిక్తతలు చెలరేగి మే 10న కాల్పుల విరమణతో ముగిసింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం (జూన్ 13-24)
ఇరాన్‌పై ఇజ్రాయెల్ 2025 జూన్ 13న సైనిక చర్య ప్రారంభించింది. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, ఇతర కీలక సదుపాయాలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ముందు రెండు సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌కు ఇరాన్ అనుకూల తీవ్రవాద గ్రూపుల మధ్య శత్రుత్వం కొనసాగింది.
చివరకు అమెరికా యుద్ధంలోకి ప్రవేశించింది. ఇజ్రాయెల్ ధ్వంసం చేయలేకపోతున్న ఇరాన్ అణు ప్రోగ్రాంలోని ప్రాంతాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. జూన్ 24న కాల్పుల విరమణ ప్రకటించారు. 12 రోజుల యుద్ధానికి ముగింపు పడింది.
Also Read: అంతకు మించిన నేరం ఇది: టీటీడీ పరకామణి చోరీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
థాయిలాండ్-కాంబోడియా సరిహద్దు ఘర్షణ (జూలై 24-28)
థాయిలాండ్-కాంబోడియా సరిహద్దు వెంట 2025 జూలై 24న ఘర్షణలు చెలరేగాయి. 10 సంవత్సరాల్లో ఎన్నడూలేనంత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జూలై 27 నాటికి 12 ప్రాంతాలకు యుద్ధం విస్తరించింది. 38 మంది మృతి చెందారు. 3,00,000 మందికి పైగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. మలేషియా మధ్యవర్తిత్వం, అమెరికా జోక్యంతో జూలై 28న కౌలాలంపూర్‌లో చర్చలు జరిగాయి. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
అఫ్ఘానిస్థాన్–పాకిస్థాన్ ఘర్షణ (అక్టోబర్ 9 నుంచి)
అఫ్ఘానిస్థాన్–పాకిస్థాన్ మధ్య 2025 అక్టోబర్ 9న ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాకిస్థాన్ సైనికులపై (తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్) దాడి చేసింది. మరుసటి రోజు కాబూల్‌లో పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ నాయకుడు నూర్ వలీ మెహ్సుద్ ను లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
తర్వాతి రోజుల్లో అఫ్ఘాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. 23 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందారు. అలాగే, తొమ్మిది మంది అఫ్ఘాన్ సైనికులు మృతి చెందారు. చివరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయినా పరిస్థితులు శాంతియుతంగా ఏమీ లేవనే చెప్పవచ్చు.
డీఆర్‌సీ- రువాండా ఘర్షణ, గోమా దాడి (జనవరి 23 నుంచి)
తూర్పు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రాంతంలో 2025 జనవరిలో ఘర్షణ తీవ్రతరం అయింది. జనవరి 23లో రువాండా బలగాల మద్దతు ఉన్న ఎం23 తిరుగుబాటుదారులు గోమా దాడిని ప్రారంభించారు. జనవరి 27న ఉత్తర కివు ప్రావిన్స్ రాజధాని గోమాను ఆక్రమించారు. జనవరి చివరి వరకు యుద్ధం కొనసాగింది. ఈ ప్రాంతంలో అస్థిరతకు దీర్ఘకాలికంగా ఉన్న జాతి ఉద్రిక్తతలు, కొల్టాన్, టిన్, బంగారం వంటి ఖనిజ సంపదపై పోటీనే ప్రధాన కారణం.
జూన్ లో అమెరికా మధ్యవర్తిత్వంతో డీఆర్‌సీ-రువాండా శాంతి ఒప్పందం కుదిరింది. డిసెంబర్ 4న వాషింగ్టన్ లో ఇరు దేశాధ్యక్షులు అధికారికంగా అంగీకారం తెలిపారు. అయినా ఈ ఒప్పందం యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఎం23 బలగాలు అనేక ప్రాంతాలపై నియంత్రణ కొనసాగించాయి. ఒప్పందం కుదిరిన తర్వాత కూడా కాంగోలీస్ దళాలు, మిత్ర బురుండీ బలగాలతో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి.