UNHRC: పాకిస్థాన్‌కు యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఆ ప్రాంతాలన్నీ భారత్‌ భూభాగంలోనివే ..

యూఎన్‌హెచ్ఆర్‌సీ (ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి)లో కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్‌ వ్యాఖ్యలకు భారత్ మరోసారి దీటుగా సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదం, ఆ దేశంలో మైనార్టీలపై దాడులకు పాల్పడటం వంటి అంశాలను ప్రస్తావిస్తూ పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Seema Pujani

UNHRC: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్‌పై ఆరోపణలు గుప్పించింది. దక్షిణాసియా ప్రాంతంలోని ఓ పెద్ద దేశానికి భారీగా ఆయుధ సరఫరా జరుగుతోందని, భారత్ పేరును ఆమె పరోక్షంగా ప్రస్తావించింది. దీని వల్ల దక్షిణాసియాలో వ్యూహాత్మక స్థిరత్వం దెబ్బతింటుందని, పాకిస్థాన్ జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలకు భారత్ దీటుగా స్పందించింది. ఐరాసాలో భారత ప్రతినిధి సీమా పుజానీ మాట్లాడుతూ.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాక్ కూరుకుపోయిందని, అయినా భారత్ పై అక్కసు వెళ్లగక్కడం మానుకోవటం లేదని, దీనిని బట్టిచూస్తే పాక్ ప్రాధాన్యాలను తెలియజేస్తుందని విమర్శించారు. ముందు పాక్ ప్రజల శ్రేయస్సు కోసం ఆ దేశ నాయకత్వం, అధికారులు కృషి చేయాలని హితు పలికారు.

 

పాకిస్థాన్‌లో ఏ మతపరమైన మైనార్టీ స్వేచ్ఛగా జీవించలేరని, వారి మతాన్ని ఆచరించలేరని పుజానీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది పౌరుల మరణాలకు పాకిస్థాన్ విధానాలు ప్రత్యక్షంగా కారణమవుతున్నాయని విమర్శించారు. గత దశాబ్దంలో బలవంతంపు అదృశ్యాలపై పాకిస్థాన్ సొంత విచారణ కమిషన్ కు 8,463 ఫిర్యాదులు అందాయని, వీరిలో వైద్యులు, ఇంజనీర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారని పుజానీ పేర్కొంది. క్రైస్తవ సమాజం పట్ల వ్యహరిస్తున్న తీరుకూడా అంతేదారుణంగా ఉందని, తరచూ క్రూరమైన దైవదూషణ చట్టాల ద్వారా ఆ దేశంలోని మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటుందని పుజానీ విమర్శించారు.

 

 

కశ్మీర్ విషయంలో పాక్ చేసిన ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం భారతదేశంలో భాగమేనని పుజానీ అన్నారు. భారత్ పై దుష్ప్రచారం చేయడంలో పాకిస్థాన్ ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని, అది పాకిస్థాన్ తప్పుడు ప్రాధాన్యతకు సంకేతమని ఆమె విమర్శించారు. భారత భూభాగాన్ని పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమిస్తోందని అన్నారు.