Eye Operation: పాకిస్థానీ రోగికి ఓ భారతీయ వైద్యుడు శ్రీలంకలో శస్త్రచికిత్స చేశారు. కొలంబోలోని కంటి ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌కు చెందిన ఓ అంధుడికి ముంబైకి చెందిన కంటి సర్జన్ శస్త్రచికిత్స చేశారు.
పాకిస్థాన్‌కు చెందిన ఓ రోగి భారత్‌లో కంటికి శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నాడు. అయితే, అతడికి నాలుగు నెలలుగా మెడికల్ వీసా దొరకడం లేదు. అలాగే, ముంబైకి చెందిన కంటి సర్జన్ డాక్టర్ ఖురేశ్ మస్కతికి కూడా పాకిస్థాన్ వెళ్లి శస్త్రచికిత్స చేయడానికి వీసా దొరకలేదు.
దీంతో ఆ రోగి కొలంబోలోని ఆసుపత్రిలో చేరగా, భారత్ నుంచి డాక్టర్ ఖురేశ్ వెళ్లి ఆ అంధుడి కంటికి శస్త్రచికిత్స చేశారు. దీనిపై డాక్టర్ మస్కతి మాట్లాడుతూ.. తాను ఓ కాన్ఫరెన్స్ కోసం కొలంబో వెళ్లాల్సి ఉండగా, అక్కడ రోగికి ఆపరేషన్ చేయడానికి లైసెన్స్ కోసం శ్రీలంక మెడికల్ కౌన్సిల్‌ని సంప్రదించానని అన్నారు.
శ్రీలంక మెడికల్ కౌన్సిల్ అంగీకరించడంతో అతడు కూడా అక్కడకు వచ్చాడని తెలిపారు. స్థానిక కంటి సర్జన్ డాక్టర్ కుసుమ్ రత్నాయక్ సాయంతో ఖురేశ్ కొన్ని రోజుల క్రితం కొలంబోలో ఆపరేషన్ చేశారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆ పేషెంట్ కుడి కన్ను పూర్తిగా దెబ్బతిందని, వైద్యులు గతంలో అతని ఎడమ కంటికి రెండుసార్లు కార్నియల్ మార్పిడి చేశారని తెలిపారు.
కానీ రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరించారు. అతని ముందున్న ఏకైక ఆప్షన్ కృత్రిమ కార్నియా అని, దీంతో పాక్‌లోని స్థానిక వైద్యుడు ఒకరు తనను సంప్రదించారని డాక్టర్ మస్కతి చెప్పారు. ఇటీవల ఆపరేషన్ చేసిన 48 గంటల్లోనే ఆ రోగి కళ్లు కనపడుతున్నాయని తెలిపారు.