“అవును.. నిజమే”.. రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్‌ దాడులు చేసిందని అంగీకరించిన పాక్ ప్రధాని

తాను దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఆ సమయంలో అసిమ్‌ మునీర్‌ మాటల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి కనపడ్డాయని తెలిపారు.

Pak PM Shehbaz Sharif

పాకిస్థాన్‌లోని రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌, ఇతర ప్రదేశాలపై భారత్‌ ఇటీవల క్షిపణులతో దాడి చేసినట్లు పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. మే 9, 10 తేదీల మధ్య అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తనకు స్వయంగా ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడి గురించి తెలిపారని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

భారత్‌ చేపట్టిన సైనిక చర్యలో భాగంగా తమ దేశంలోని పలు ప్రదేశాల్లో దాడులు జరిగాయన్న విషయాన్ని పాకిస్థాన్ తిరస్కరిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ కొనసాగిస్తున్న ఈ వైఖరికి విరుద్ధంగా షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో పాక్‌ తీరు మరోసారి బయటపడినట్లయింది.

ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ మాన్యుమెంట్ వద్ద జరిగిన ప్రత్యేక ‘యూమ్ ఏ తషాకూర్’ కార్యక్రమంలో పాల్గొన్న షెహబాజ్ షరీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తనకు ఫోన్ చేసి, హిందుస్థానీ బాలిస్టిక్ క్షిపణులు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, ఇతర ప్రాంతాలను ఢీకొట్టాయని చెప్పారని అన్నారు. తాను దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఆ సమయంలో అసిమ్‌ మునీర్‌ మాటల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి కనపడ్డాయని తెలిపారు.

Also Read: ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల.. అదరగొట్టేసిన కమల్

దేశాన్ని కాపాడటానికి పాకిస్థాన్ వైమానిక దళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిందని షెహజాబ్ షరీఫ్ చెప్పారు. పాక్‌ సైనికులు వాడిన చైనా యుద్ధ విమానాల్లో ఆధునిక గాడ్జెట్‌లు, సాంకేతికతను కూడా ఉపయోగించారని అన్నారు.

కాగా, మే 10న తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాలను భారత క్షిపణులు, డ్రోన్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని పాకిస్థాన్‌ అప్పట్లో చెప్పింది. పాకిస్థాన్ సైనిక ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అప్పట్లో ఇస్లామాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన నూర్ ఖాన్, మురిద్, రఫికి వైమానిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుందని అన్నారు.

పాకిస్థాన్‌లోని పలు వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని మాక్సర్ టెక్నాలజీస్ ఇటీవల తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా కూడా తెలిసింది.

భారత్‌ చేసిన దాడులను ఒప్పుకుంటూ షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో స్పందిస్తూ.. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, ఇతర అనేక ప్రదేశాలపై భారత్‌ దాడులు చేసిందని జనరల్ అసిమ్ మునీర్ తెల్లవారుజామున 2.30 గంటలకు తనకు ఫోన్ చేసి చెప్పినట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా అంగీకరించారని అన్నారు. పాకిస్థాన్‌లో దాడులు జరుగుతున్నాయన్న వార్తలతో పాక్ ప్రధానమంత్రి అర్ధరాత్రి మేల్కొన్నారని చెప్పారు. ఇది ఆపరేషన్ సిందూర్ కచ్చితత్వం, ధైర్యసాహసాలను స్పష్టం చేస్తోందని అన్నారు.