Rafale M Fighter Jet : శత్రు దుర్భేద్యంగా నేవీ.. భారత నేవీ అమ్ములపొదిలో రాఫెల్‌ యుద్ధ విమానాలు

Rafale M Fighter Jet : గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగగా, ఈ నెల 30న భారత్‌ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్‌ ప్రతినిధుల బృందం.

Rafale M Fighter Jet : శత్రు భీకర యుద్ధ విమానాలు రాఫెల్‌-ఎం భారత నేవీ అమ్ములపొదిలో చేరనున్నాయి. ఇందుకోసం ఫ్రాన్స్‌తో మన రక్షణశాఖ భారీ డీల్‌ చేసుకోనుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్స్‌ వద్ద ఈ యుద్ధ విమానాలు ఉండగా, ఇప్పుడు నేవీకి సమకూర్చాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం… రాఫెల్‌ యుద్ధ విమానాలతో మన నేవీ బలం పెరుగుతుందా? శత్రుదేశాలకు చెక్‌ చెప్పినట్లేనా?

హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న చైనాకు చెక్‌ పెట్టేదిశగా, మన రక్షణశాఖ కీలక అడుగులు వేస్తోంది. విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కోసం 26 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో జరుగుతున్న చర్చల్లో ముందడుగు పడింది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగగా, ఈ నెల 30న భారత్‌ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్‌ ప్రతినిధుల బృందం.

ఢిల్లీలో రక్షణశాఖ అధికారులతో భేటీ అయింది. ఈ కీలకభేటీలో సుమారు 50 వేల కోట్ల విలువైన 26 రాఫెల్‌ మెరైన్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. స్వదేశీ విమాన వాహకనౌక విక్రాంత్‌పై మోహరించేందుకు వీలుగా రాఫెల్‌ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం ఆమోదముద్ర వేసింది.

ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థ శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఈ సంస్థ నుంచి గతంలో 36 యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు నావికాదళానికి కూడా ఈ యుద్ధవిమానాలను సమకూర్చాలనే ఆలోచనతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ 26 విమానాలను తయారు చేయాలని డసాల్ట్‌ ఏవియేషన్‌ను కోరింది రక్షణ శాఖ.

రాఫెల్ ఎం లేదా రాఫెల్‌ మెరైన్‌గా పిలిచే ఈ సింగిల్ సీటర్ జెట్‌ ఫైటర్‌ శత్రువులకు సింహస్వప్నంగా చెబుతున్నారు. ఏకకాలంలో గగనతల రక్షణతోపాటు, అణుదాడులను ఎదుర్కొనడం, శత్రు గగనతలాల్లోకి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం, సమర్థంగా నిఘా వేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు. గంటకు 13 వందల 89 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యంతోపాటు గగనతలంలో గరిష్ఠంగా 50 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు. లాంగ్ రేంజ్ మెటియోర్ మిస్సైళ్లు, ఎంఐసీఏ క్షిపణులు, హ్యామర్, స్కాల్ప్, ఏఎం 39, ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2 వేల 500 రౌండ్లు పేల్చగల శతఘ్ని ఉంటాయి.

లక్ష్యంపై కచ్చితత్వంతో దాడులు చేయడంలో రాఫెల్‌ విమానాలకు మరేవీ సాటి రావని రక్షణ నిపుణులు చెబుతున్నారు. శత్రువు కంటికి కనిపించనంత దూరంలో ఉన్నా.. దాడి చేసే మెటర్స్‌ క్షిపణులు రాఫెల్‌లో ఉన్నాయి. సరికొత్త టెక్నాలజీతో ప్రపంచంలో అత్యున్నతమైన యుద్ధ విమానాలుగా రాఫెల్‌కు గుర్తింపు ఉంది. శత్రుదేశాలైన పాకిస్థాన్‌, చైనాల దూకుడుకు కళ్లెం వేసేందుకు మన నేవీని బలోపేతం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్‌కు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా మన రక్షణ శాఖ పావులు కదుపుతోంది.

Read Also : Sourav Ganguly : టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి.. గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కాస్త తెలివిని వాడండి

ట్రెండింగ్ వార్తలు