వీడు మృత్యుంజయుడు : 11,240 అడుగుల ఎత్తైన శిఖరంపై నుంచి జారిపడినా బతికాడు!

  • Publish Date - January 3, 2020 / 12:06 PM IST

అమెరికాలోనే అత్యంత ఎత్తైనా శిఖరంపై నుంచి కింద పడిన భారత సంతతికి చెందిన 16 ఏళ్ల కుర్రాడు అద్భుతమైన రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. 11,240 అడుగుల ఎత్తు ఉండే ఈ శిఖరాన్ని మౌంట్ హుడ్ అని పిలుస్తారు. అమెరికా రాష్ట్ర ఒరిగాన్ తీర ప్రాంతంలో ఈ శిఖరాగ్రం ఉంది. ఈ పర్వతాన్ని ఎక్కేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

కెనడాలోని సుర్రే ప్రాంతానికి చెందిన ఈ కుర్రాడి పేరు గుర్భాజ్ సింగ్.. జనవరి 2న (మంగళవారం) తన స్నేహితులతో కలిసి శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లాడు. తన 90వ రికార్డు మార్క్‌ను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. శిఖరం ఎక్కే క్రమంలో మంచుపై కాలు ఒక్కసారిగా జారింది. పర్వతంపై పెర్లీ గేట్స్‌గా పేరొందిన శిఖరం కొన నుంచి జారిపోయి డెవిల్ కిచెన్ ఏరియా కిందిభాగంలో 500 అడుగుల ఎత్తు వరకు గుర్భాజ్ పడిపోయినట్టు ఓ ఛానల్ రిపోర్టులో తెలిపింది. అదృష్టవశాత్తూ గుర్భాజ్‌కు ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతడి కాలు మాత్రమే విరిగింది.

అప్రమత్తమైన సెర్చ్, రెస్క్యూ సిబ్బంది అతడ్ని రక్షించడం కోసం తీవ్రంగా శ్రమించారు. 10,500 అడుగుల ఎత్తులో శిఖరంపై అంత ఎత్తుకు వెళ్లి అతన్ని కాపాడేందుకు సహాయక సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అమెరికా దేశంలోనే మంచుతో కప్పబడి ఉండే అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒరిగాన్ ప్రాంతంలో మౌంట్ హుడ్ శిఖరం ఒకటి. ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ఎంతోమంది పర్వతారోహకులు సందర్శిస్తుంటారని యూఎస్ ఫారెస్ట్ సర్వీసు డేటా తెలిపింది. ప్రతి ఏడాది ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు 10వేల మందికి పైగా పర్వతారోహకులు వస్తుంటారని అక్కడి అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై గుర్భాజ్ తండ్రి రిషామ్ దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఎక్కడో ఒకచోట తాను ఆగిపోతానని అతడికి తెలుసు. జారిపడే సమయంలో తనను తాను కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ, అలా జరగలేదు. ఎందుకుంటే వేగంగా తిరుగుతూ కింద పడటంతో సాధ్యపడలేదు’ అని అన్నారు. ప్రాణాలతో బయటపడిన గుర్భాజ్ తన కాలిగాయానికి చికిత్స నిమిత్తం పోర్ట్ ల్యాండ్ లోని ఓ ఆస్పత్రికి వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు.

అతడి శిక్షణ నైపుణ్యం, తలకు హెల్మట్ ధరించడంతో పెద్దగా గాయాలు కాలేదు. ఈ విషయంలో అతన్ని అక్కడి వారంతా ప్రశంసలతో ముంచెత్తారు. జారిపడిన తర్వాత నా హెల్మట్ చూశానని,అది పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిపాడు.అదృష్టవశాత్తూ తన తలకు ఎలాంటి గాయాలు కాలేదని సింగ్ చెప్పుకొచ్చాడు. తన కుమారుడు గుర్భాజ్.. పూర్తిగా కోలుకున్నాక తామిద్దరూ కలిసి మళ్లీ మౌంట్ హుడ్ శిఖరాన్ని అధిరోహించి తీరుతామని తండ్రి రిషమ్ దీప్ సింగ్ తెలిపారు.