రక్తపుమడుగులో భార్యాభర్తలు.. శరీరాలపై కత్తిపోట్లు.. బాల్కనీలో చిన్నారి.. అమెరికాలో భారత జంట అనుమానాస్పద మృతి..

అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూజెర్సీలో ఈ ఘటన జరిగింది. అమ్మానాన్న రక్తపు మడుగులో పడి ఉండగా, వారి నాలుగేళ్ల చిన్నారి బాల్కనీలో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది.

Indian Techie, Wife Dead In Us

Indian Techie, Wife Dead In US: అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూజెర్సీలో ఈ ఘటన జరిగింది. అమ్మానాన్న రక్తపు మడుగులో పడి ఉండగా, వారి నాలుగేళ్ల చిన్నారి బాల్కనీలో వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది. అది గమనించిన పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లగా.. చిన్నారి తల్లిదండ్రులు రక్తపుమడుగులో విగతజీవులుగా కన్పించారు.

2014లో పెళ్లి, 2015లో అమెరికాకి:
మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాకు చెందిన బాలాజీ భరత్ రుద్రావర్‌(32) ఐటీ ఉద్యోగి. అమెరికాలోని ఓ ప్రముఖ భారత ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. బాలాజీ భార్య ఆర్తి (30) గృహిణి. 2015 ఆగస్టులో ఉద్యోగరీత్యా బాలాజీ తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లాడు. ఈ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది. బాలాజీ భార్య ఆర్తి ప్రస్తుతం 7 నెలల గర్భిణి. 2014లో బాలాజీ, ఆర్తిల పెళ్లి జరిగింది.

రక్తపు మడుగులో అమ్మానాన్న, బాల్కనీలో చిన్నారి:
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం(ఏప్రిల్ 7,2021) బాలాజీ కూతురు న్యూజెర్సీలోని నార్త్‌ ఆర్లింగ్టన్‌లో గల తన ఇంటి బాల్కనీలో ఏడుస్తూ కన్పించింది. చిన్నారిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో డోర్‌ బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. బాలాజీ, ఆయన భార్య లివింగ్‌ రూంలో రక్తపుమడుగులో కన్పించారు. ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

భార్యను చంపి ఆత్మహత్య?
బాలాజీ తన భార్యను పొడిచి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటారని అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ మృతికి గల కారణాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు. కాగా, తల్లిదండ్రులకు ఏమైందో తెలుసుకోలేని ఆ చిన్నారి.. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ చిన్నారి ఇప్పుడు అనాథగా మారింది. ప్రస్తుతం ఆ చిన్నారి.. బాలాజీ ఫ్రెండ్ సంరక్షణలో ఉంది.

షాక్ లో తల్లిదండ్రులు:
ఈ విషయం తెలిసి మహారాష్ట్రలో ఉంటున్న బాలాజీ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ”నా కొడుకు, కోడలు చాలా ఆనందంగా ఉండేవారు. ఎవరితోనూ గొడవల్లేవు. ఎలా చనిపోయారో అర్థం కావట్లేదు. అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’’ అని బాలాజీ తండ్రి భరత్‌ రుద్రావర్‌ కన్నీటిపర్యంతం అయ్యారు. బాలాజీ తండ్రి భరత్ రుద్రావర్ బిజినెస్ మ్యాన్. ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలోని టెంపుల్ టౌన్ లో నివాసం ఉంటారు.

ఈ ఘటనతో ఇరు కుటుంబాలను షాక్ కి గురి చేసింది. తీవ్ర విషాదం నింపింది. అసలేం జరిగిందో ఎవరికీ తెలియడం లేదు. ఈ మరణాల వెనుకున్న మిస్టరీని పోలీసులు చేదించే పనిలో ఉన్నారు. కాగా, మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం 8 నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.