Biden On India
Biden On India : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. మూడు వారాలు దాటింది. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ పై రష్యా సేనలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, కఠిన ఆంక్షలు విధిస్తున్నా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చినా.. పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అనుకున్నది సాధించేవరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు.
ఇదిలా ఉంటే, యుక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా విషయంలో తటస్థంగా ఉంటూ వస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కోపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో బలహీనంగా ఉందని అన్నారు. అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకొస్తుంటే.. ఢిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా స్పందిస్తోందన్నారు. సీఈవోలతో జరిగిన బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.(Biden On India)
యుక్రెయిన్ పై రష్యా దురాక్రమణను ఖండించే విషయమై తమ భాగస్వామ్య పక్షాల్లో భారత్ స్పందన ఒక్కటే భిన్నంగా, కుదుపునకు గురిచేసేలా ఉందన్నారు బైడెన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యంలోని భాగస్వామ్య పక్షం, నాటో, ఐరోపా యూనియన్, ఆసియా భాగస్వామ్య దేశాలు ఐక్యంగా నిలబడడం పట్ల బైడెన్ అభినందించారు. అసాధారణ స్థాయిలో ఆర్థిక ఆంక్షలతోనూ రష్యాను కట్టడి చేస్తున్నట్టు చెప్పారు.(Biden On India)
Russia Condom Sales : యుద్ధం వేళ.. రష్యాలో భారీగా పెరిగిన కండోమ్ అమ్మకాలు
క్వాడ్ గ్రూపులోని సహచర సభ్య దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ మాదిరిగా కాకుండా, భారత్ ఒక్కటే రష్యా చర్యను వ్యతిరేకించకుండా, సమర్థించకుండా తటస్థంగా ఉండిపోయింది. రష్యాకు వ్యతిరేకంగా విధించే ఆంక్షల్లోనూ భాగం కాలేదు. పైగా రష్యా నుంచి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో బైడెన్ ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యా సేనలు క్షిపణుల వర్షం కురిపిస్తున్నా.. బాంబులతో బెంబేలెత్తిస్తున్నా యుక్రెయిన్ సైనికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో రష్యా కొత్త వ్యూహాలకు తెరలేపింది. మరియుపోల్‌లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కారిడార్లు ఏర్పాటు చేస్తామని, దీనికి బదులుగా ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు విడిచి, మరియుపోల్‌ను అప్పగించాలని డిమాండ్ చేసింది. రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. తమ నగరాలను, దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అప్పగించేది లేదని తేల్చిచెప్పింది. దీంతో పుతిన్ సేనలు మరింతగా రెచ్చిపోయాయి.
సోమవారం రాత్రి మరియుపోల్‌పై ప్రతి 10 నిమిషాలకొకసారి బాంబుల వర్షాన్ని కురిపించాయి. అంతకుముందు కీవ్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు. పశ్చిమ దేశాలు పంపిన ఆయుధాలు, టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో రష్యా బలగాలపై యుక్రెయిన్ సేనలు పోరాడుతున్నాయి.
వాస్తవానికి బెలారస్ నుంచి కీవ్ పదుల కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రష్యా యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ రాజధానిని వశపర్చుకొని ప్రభుత్వాన్ని మార్చేస్తుందని భావించారు. కానీ, ఆ అంచనాలు నిజం కాలేదు. దాదాపు మూడు వారాలుగా భీకర గెరిల్లా యద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే 14వేల మందికి పైగా రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ రక్షణశాఖ వెల్లడించింది.
Russian President Putin : ప్రాణభయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్
మరోపక్క రష్యా దళాలు ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు వాడుకోకుండా అడ్డుకుంటున్నారు. వంతెనలు, విమానాశ్రయాల్లో లెక్కలేనన్ని ల్యాండ్‌మైన్లు పాతిపెట్టారు. రష్యా దళాలు వీటిని వాడుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. యుద్ధం ముగిశాక కూడా వీటిని తొలగించాలంటే కొన్నేళ్లు పట్టవచ్చని అంచనా. మరోపక్క ఆంక్షలు తీవ్రం కావడంతో మిత్రదేశాలు రష్యాకు దూరంగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పుతిన్ ప్లాన్-బిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.