Indonesia
Indonesia Earthquake: ఇండోనేషియాలో సోమవారం సంభవించిన భూకంపం పెనువిధ్వంసం సృష్టించింది. ఇండోనేషియా నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ అధిపతి ప్రకారం.. ఈ ఘటనలో మృతుల సంఖ్య 268కి చేరింది. మరో 151 మంది జాడకనిపించడం లేదు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో చాలావరకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నేలకూలిన ఇళ్ల శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో కుప్పలుకుప్పలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి. శిథిలాల కింద మరికొందరు మరణించి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
భూకంపం ప్రకంపనలు బలంగా ఉండటంతో భూమి కొన్ని నిమిషాల పాటు కంపించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతుతో కేంద్రీకృతమై ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 22వేల ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డవారి సంఖ్య వెయ్యికిపైగానే ఉంది. వారందరికీ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
Heartbreaking and Devastating visuals from #Indonesia Pray for Cianjur people.
May God keep everyone safe ?#earthquake in #Cianjur of #Indonesia pic.twitter.com/uCnUpSNosx— Supriya (@Supriya404) November 22, 2022
భూకంపం సంభవించిన తర్వాత నగరంలో సయాంగ్ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వైద్యులు బాధితులకు వెంటనే చికిత్స అందించలేకపోయారని, ఫలితంగా మృతుల సంఖ్య ఎక్కువగా జరిగింది. ఆస్పత్రికి వచ్చిన తరువాతనే చాలా మంది తీవ్రగాయాలతో మరణించారని సియాంజూర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందుతుందని వారు అన్నారు.