America
America: కరోనాతో తల్లడిల్లుతున్న అమెరికాపై ప్రకృతి కూడా పగబట్టినట్లే కనిపిస్తోంది. భీకర తుపానుతో విరుచుకుపడుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. ఏకంగా నదుల ప్రవాహ దిశను మారిపోతుంది. ప్రమాదకరమైన 4వ కేటగిరీకి చెందిన తుపానుగా మారిన ఐదా.. లూసియానా తీరప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తోంది. ప్రచండ గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంట్ కట్ అవ్వగా.. చాలా ప్రాంతాలు అంధకారం అయ్యాయి.
ఆగ్నేయ లూసియానా మీదుగా.. ఉత్తరం వైపునకు కదిలిన ఐదా హరికేన్… మెక్సికో ఉత్తర గల్ఫ్‌ను దాటి లూసియానా తీరాన్ని తాకింది. న్యూ ఒర్లాన్స్కు దక్షిణాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ ఫోర్చౌన్ వద్ద తీరాన్ని తాకినట్లు అమెరికా జాతీయ హరికేన్ సెంటర్ వెల్లడించింది. ఈ సమయంలో తుపాను విలయం సృష్టించింది. దీంతో లూసియానా తీరప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది.
ఐదా తుపానుతో కుండపోత వర్షంతోపాటు ప్రచండ గాలులు వీచాయి. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో సముద్రం పోటెత్తింది. బలమైన గాలులతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. తీరప్రాంతాల్లోని పోర్టు భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. వీధుల్లోకి వరద నీరు చేరింది. 4 నుంచి 7 అడుగుల ఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో చాలామంది నివాసాలను వదిలి రోడ్లపైకి వస్తున్నారు. కానీ.. ఎప్పుడు ఏ చెట్టు విరిగిపడుతుందో, ఏ విద్యుత్ స్తంభం నేలకూలతుందోనని భయంభయంగా బతకాల్సి వస్తోంది.
మిస్సిసిపిలో ఐదా తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తుపాను తీరందాటే సమయంలో వీచిన పెనుగాలుల ధాటికి మిస్సిసిపి నది ఏకంగా రివర్స్ లో ప్రవహించింది. పదుల సంఖ్యలో బ్యారేజీలో కొట్టుకుపోయాయి. న్యూ ఓర్లీన్స్ పైనా ఐదా ఎఫెక్ట్ చూపించింది. ఇక్కడ కూడా పెద్దమొత్తంలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ నిలిచిపోయింది. న్యూ ఓర్లీన్స్ లో దాదాపు 8లక్షల మంది చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆగస్టు 29, 2005న సంభవించిన కత్రినా తుపాను… లూసియానా, మిస్సిసిపిలను కకావికలం చేసింది. 16ఏళ్ల తర్వాత సరిగ్గా అదేరోజున వచ్చిన ఐదా తుపాను కూడా అదే రీతిలో భయపెడుతోంది. దీంతో లూసియానా, మిస్సిసిపిల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధికారులు.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. తుపాను బాధితుల కోసం అత్యవసర ప్రాతిపదికన షెల్టర్లు ఏర్పాటుచేశారు. లూసియానా నుంచి ఇప్పటికే వేలాది మందిని తరలించారు.
మిస్సిసిపి తీరంలోని అధికారులు సైతం అలర్టయ్యారు. గల్ఫ్‌పోర్ట్‌లో తరలింపుదారుల కోసం సూచనలు, హెచ్చరికలు చేస్తూ రెడ్‌క్రాస్ షెల్టర్ బోర్డు పెట్టారు. అయితే.. కోవిడ్ ఇన్ఫెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా వుండడం, డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపించడంతో తాజాగా తుపాను కారణంగా ఈ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
తుపాన్ తీవ్రత తగ్గే వరకు లూసియానా ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ జాగ్రత్త వహించాలని అధ్యక్షుడు బైడెన్ సూచించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.