మిసైళ్లతో ప్రసిద్ధ వైజ్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌పై ఇరాన్ దాడి.. రూ.433 కోట్ల నష్టం.. యావత్‌ ప్రపంచానికి ఏ నష్టం వాటిల్లిందంటే..

క్యాన్సర్‌, హృద్రోగాలు, స్ట్రోక్‌ వంటి సమస్యల పరిష్కారానికి దోహదపడే పరిశోధనలు జరిగాయి.

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ చేసిన దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇరాన్‌ తాజాగా చేసిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లోని ప్రసిద్ధ వైజ్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ తీవ్రంగా దెబ్బతింది.

ఇజ్రాయెల్‌కు, దాని మిత్ర దేశాలకు ఇరాన్‌ తీవ్ర హెచ్చరిక జారీ చేసిన కొద్ది సేపటికే ఈ దాడులు జరిగాయి. రెండు భవనాలతో పాటు వైజ్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లోని అనేక పరిశోధనల గ్రంథాలు నాశనమయ్యాయి. రూ.433 కోట్ల నష్టమే కాకుండా మానవాళికి ఉపయోగపడే ఎన్నో పరిశోధనల పత్రాలు బూడిదపాలయ్యాయి.

లైఫ్‌ సైన్స్‌ పరిశోధనలకు ఈ ఇన్‌స్టిట్యూట్‌ ప్రసిద్ధి చెందింది. ఇందులో 45కి పైగా ప్రయోగశాలలు, ఎన్నో దశాబ్దాలుగా చేసిన, చేస్తున్న పరిశోధనలకు సంబంధించిన డేటా పూర్తిగా నాశనమైంది. శాస్త్ర, సాంస్కృతిక రంగంలో వాటిల్లిన అతిపెద్ద నష్టం ఇది. న్యూమరాలజికల్‌ డిసార్డర్స్‌, క్యాన్సర్‌, హృదయ సంబంధిత వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న ప్రయోగశాలలు కూడా నాశనం అయ్యాయి.

ఇరాన్‌ క్షిపణి దాడిలో జీవవిజ్ఞాన శాస్త్రానికి చెందిన భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఇజ్రాయెల్‌లోని కీలకమైన ‘క్రౌన్‌ జువెల్‌’ భవనం సైతం పూర్తిగా నాశనమైంది. “ఇక్కడ ఇక ఏమీ మిగల్లేదు” అని ప్రొఫెసర్‌ ఓరెన్‌ స్కూల్డినర్‌ చెప్పారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ నాశనం కావడంతో తమ 16 సంవత్సరాల శ్రమ బూడిదపాలైందన్నారు. ఎందరో శాస్త్రవేత్తల జీవిత లక్ష్యాలను ఈ దాడి నాశనం చేసిందని ఆవేదన చెందారు.

Also Read: మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ప్రస్తుతం ఏం జరుగుతోంది?

వైజ్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రాధాన్యం ఇదే..
ఇజ్రాయెల్‌లో 1934లో వైజ్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఇజ్రాయెల్‌ మొదటి అధ్యక్షుడి పేరును దీనికి పెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత తూరింగ్‌ అవార్డు విజేతలలో ముగ్గురు, కెమిస్ట్రీ నోబెల్‌ అవార్డు విజేతల్లో ఒకరు ఈ ఇన్‌స్టిట్యూట్‌కు చెందినవారే.

ప్రతి సంవత్సరం వందల పరిశోధనా పత్రాలు ఇక్కడి శాస్త్రవేత్తల కృషిలో భాగంగా వెలువడుతున్నాయి. 1954లో ఇజ్రాయెల్‌ మొదటి కంప్యూటర్‌ తయారుచేసిన ఘనత కూడా సంస్థకే చెందుతుంది. 2015లో ఎలుకలపై హృదయ కణజాలాన్ని తిరిగి పెంచే పరిశోధన విజయవంతమైంది.

అంతేగాక, 2018లో క్యాన్సర్‌, హృదయ వ్యాధులు, స్ట్రోక్‌ వంటి సమస్యల పరిష్కారానికి దోహదపడే పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు హృదయ శాస్త్రంపై పరిశోధనలు చేస్తున్న ప్రయోగశాల సహా దాదాపు 45 ప్రయోగశాలలు నాశనం అయ్యాయి. ఒక ప్రొఫెసర్‌ 22 సంవత్సరాలుగా చేస్తున్న పరిశోధనలు, జన్యు నమూనాలు, హృదయ కణజాలాలను ఈ దాడి వల్ల కోల్పోయారు.