Iran Israel Conflict: మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ప్రస్తుతం ఏం జరుగుతోంది?

ధరల పెరుగుదల అంచనాలపై నిపుణులు ఏమంటున్నారు?

Iran Israel Conflict: మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ప్రస్తుతం ఏం జరుగుతోంది?

Updated On : June 23, 2025 / 3:30 PM IST

మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలు వస్తున్నాయి. అమెరికా ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడులు జరిపిన నేపథ్యంలో ముడిచమురు ధరలపైనే ప్రపంచం దృష్టి ఉంది. అమెరికా దాడులకు ప్రతిగా హార్ముజ్‌ జలసంధిని మూసివేయాలని ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచ ముడిచమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ సముద్ర మార్గం గుండా సాగుతుంది. తాజాగా, అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా ముడిచమురు రవాణా ఖర్చు పెరిగే అవకాశం ఉంది.

హార్ముజ్‌ మూసివేత వార్తల నేపథ్యంలో ముడిచమురు సరఫరా అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి అన్నారు. దేశీయంగా ముడిచమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాల్లో ముడిచమురు సరఫరా మార్గాలు విస్తరించామని, ఇప్పుడు పెద్ద మొత్తంలో సరఫరా హార్ముజ్‌ మార్గం గుండా రావడం లేదని ఆయన ట్వీట్‌ చేశారు. ఆయిల్‌ కంపెనీల వద్ద కొన్ని వారాల సరఫరా నిల్వగా ఉందని, వివిధ మార్గాల ద్వారా సరఫరా కొనసాగుతుందని తెలిపారు. దేశ ప్రజలకు కావాల్సిన ఇంధన సరఫరాకు అంతరాయాలు కలగకుండా ఉండేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read: “సాయంత్రంలోగా నిన్ను లేపేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి” అంటూ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్

మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు చెలరేగుతాయన్న అంచనాలు ముందు నుంచే ఉన్నాయని పూరి తెలిపారు. హార్ముజ్‌ మూసివేస్తారన్న అంచనాలు సహా అన్ని అంశాలను ప్రధాని నేతృత్వంలో ప్రభుత్వం సమీక్ష చేస్తోందన్నారు.

భారత్‌ రోజుకి 5.5 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురును వినియోగిస్తోంది. ఇందులో 1.5 – 2 మిలియన్‌ బ్యారెళ్లు హార్ముజ్‌ మార్గం గుండా వస్తాయి. మిగిలిన బ్యారెళ్లు ఇతర మార్గాల ద్వారా వస్తున్నాయని పూరి తెలిపారు. ఆయిల్‌ కంపెనీల వద్ద 3 వారాలకు సరిపడే నిల్వలు ఉన్నాయి.

వాటిలో ఒక సంస్థ వద్ద 25 రోజులకు సరిపడే నిల్వ ఉంది. అవసరమైనప్పుడు ఇతర మార్గాల ద్వారా సరఫరా పెంచే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ధరల పెరుగుదల అంచనాలపై నిపుణులు ఏమంటున్నారు?
ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. మిడిల్‌ ఈస్ట్‌ ప్రపంచ ఆయిల్‌ ఎగుమతిలో కీలక ప్రాంతం కావడం వల్ల పరిస్థితి తీవ్రతరమైంది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ గణాంకాల ప్రకారం.. గత వారం క్రూడ్‌ నిల్వలు 11.5 మిలియన్‌ బ్యారెళ్లు తగ్గాయి.

క్రూడ్‌ ధరలు నాలుగు నెలల గరిష్ఠానికి చేరినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై ఓ నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు వారాలు పడుతుందని సంకేతాలిచ్చిన తర్వాత ధరలు కొంత తగ్గాయి.