×
Ad

Iran Protests: ఫోటోలు కాల్చి సిగరెట్లు తాగుతున్న అమ్మాయిలు.. ఎందుకిలా? వీడియోలు వైరల్

డిసెంబర్ 28 నుండి నిరసనలు మొదలయ్యాయి. యువకులు, వృద్ధులు అనే తేడా లేదు. అంతా వీధుల్లోకి వచ్చేశారు. Iran Protests

Iran Protests Representative Image (Image Credit To Original Source)

  • ఇరాన్ లో పీక్స్ కి చేరిన నిరసనలు
  • ఇస్లాం దేశంలో కొత్త ట్రెండ్
  • సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలు కాల్చి సిగరెట్ వెలిగించుకుంటున్న అమ్మాయిలు

Iran Protests: ఇరాన్ లో ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడీ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అక్కడి యువతులు, మహిళలు మరో అడుగు ముందుకేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలకు నిప్పు అంటించి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు. ఇప్పుడిది అక్కడ ట్రెండ్ గా మారింది. ఇరాన్ లో సుప్రీం లీడర్ ఫోటోకు నిప్పు పెట్టడం నేరం. అంతేకాదు మహిళలు సిగరెట్ తాగడం కూడా నేరమే. యువతులు, మహిళలు ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, స్వేచ్ఛను కోరుకుంటూ వాళ్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో యువతి లాకప్ డెత్ సమయంలోనూ మహిళలు ఇదే తరహా నిరసనలు చేపట్టారు.

ప్రజా తిరుగుబాటులో కొత్త ట్రెండ్..

ఇరాన్‌లో జరుగుతున్న రక్తసిక్తమైన ప్రజా తిరుగుబాటులో కొత్త ధోరణి వెలుగు చూసింది. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఫోటోలను తగలబెట్టి, ఆ మంటలతో ఇరానియన్ మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్న దృశ్యాలు, గత రెండు వారాలుగా ఆ మధ్యప్రాచ్య దేశాన్ని కుదిపేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో చెరగని చిత్రాలుగా నిలిచాయి. కఠినమైన సామాజిక ఆంక్షలు, మహిళల హక్కులపై పరిమితులకు పేరొందిన దేశంలో ఈ ధోరణి తిరుగుబాటుకు ప్రతీకగా మారింది.

86ఏళ్ల ఖమేనీ మతతత్వ పాలనకు, అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ఇరాన్ లో నిరసనలు ఉధృతం అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, ఆకాశాన్నంటుతున్న నిత్యవసరాల ధరలపై మొదలైన ఈ నిరసనలు, త్వరగానే ఖమేనీ పాలన, అవినీతికి వ్యతిరేకంగా ఒక విస్తృత ఉద్యమంగా రూపుదిద్దుకున్నాయి. గతానికి భిన్నంగా నిరసనకారులు కేవలం సంస్కరణలను కోరడం లేదు.. ఇస్లామిక్ రిపబ్లిక్‌నే పూర్తిగా తిరస్కరిస్తున్నారు.

డిసెంబర్ 28 నుండి ఇరాన్ లో నిరసనలు మొదలయ్యాయి. యువకులు, వృద్ధులు అనే తేడా లేదు. అంతా వీధుల్లోకి వచ్చేశారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాల్లో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. “ఖమేనీకి మరణం”, “పహ్లావీ తిరిగి వస్తాడు” వంటి నినాదాలు ఇరాన్ అంతటా ప్రతిధ్వనించాయి. నిరసనకారుల్లో ఒక వర్గం, 1979 విప్లవం సమయంలో పదవీచ్యుతుడైన ఇరాన్ చివరి షా కుమారుడైన రెజా పహ్లావీ తిరిగి రావాలని డిమాండ్ చేసింది.

Iran Protests Representative Image (Image Credit To Original Source)

ధిక్కారానికి ప్రతీక..

ఈ నిరసనలు, నినాదాల మధ్య.. సుప్రీం లీడర్ ఫోటోలను తగలబెడుతూ వాటి మంటలతో సిగరెట్లు వెలిగిస్తున్న ఇరాన్ మహిళల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సుప్రీం లీడర్ ఫోటోలు తగలబెట్టడం, మహిళలు స్మోకింగ్ నేరం..

ఇస్లామిక్ దేశంలో, సర్వోన్నత నాయకుడి చిత్రాలను తగలబెట్టడం చట్టప్రకారం తీవ్రమైన నేరం. మహిళలు స్మోక్ చేయడంపైనా ఆంక్షలు ఉన్నాయి. నిజానికి, గత సంవత్సరం ఒమిద్ సర్లాక్ అనే ఇరానీయుడు, ఖమేనీ ఫోటోకు నిప్పంటిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, ఆ వీడియో వెలుగులోకి వచ్చిన కొన్ని గంటలకే, అతని మృతదేహం అతడి కారులో లభ్యమైంది.

ఇటువంటి చర్యలలో పాల్గొన్న వారికి, ప్రభుత్వ భవనాలను తగలబెట్టిన నిరసనకారులకు మరణశిక్ష విధించబడుతుందని టెహ్రాన్ ప్రధాన ప్రాసిక్యూటర్ హెచ్చరించారు. అయితే, నిరసనకారులు వాటిని కేర్ చేయడం లేదు. ఆందోళనలను మరింత తీవ్రం చేశారు.

“ఇరానియన్ మహిళలు తమ జుట్టును చూపించి, సిగరెట్లు వెలిగించుకోవడానికి ఖమేనీ ఫోటోను తగలబెట్టడం ద్వారా తమ స్వేచ్ఛా పోరాటాన్ని జరుపుకుంటున్నారు. నిరసనకారులు రాష్ట్రాన్ని సవాల్ చేయడమే కాకుండా మహిళలపై కఠినమైన సామాజిక నియంత్రణలను వ్యతిరేకిస్తున్నారని ఈ దృశ్యాలు సూచిస్తున్నాయి” అని నెటిజన్లు తెలిపారు. ఇక నిరసనలలో యువతులే కాదు వృద్ధ మహిళలు కూడా పాల్గొంటున్నారు. ఒక వద్ధురాలు తన ముఖం మీద రక్తంతో, “నేను భయపడను. నేను చనిపోయి 47 సంవత్సరాలు అయింది” అంటూ నినాదాలు చేసింది.

 

 

Also Read: ఇరాన్‌లో నిరసనలు తీవ్రతరం.. ఇక క్రౌన్‌ ప్రిన్స్‌ తిరిగి వచ్చేస్తారా? నెక్ట్స్‌ ఏంటి.. “బాహుబలి తిరిగి వస్తాడు” రేంజ్‌లో..