ఇరాన్‌లో నిరసనలు తీవ్రతరం.. ఇక క్రౌన్ ప్రిన్స్ తిరిగి వచ్చేస్తారా? నెక్ట్స్ ఏంటి.. “బాహుబలి తిరిగి వస్తాడు” రేంజ్‌లో..
ఇస్లామిక్ విప్లవానికి ముందు క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి తండ్రి మొహమ్మద్ రెజా షా పహ్లవి ఇరాన్‌ను విడిచి వెళ్లిపోయారు.
Anti Khamenei Protests (Image Credit To Original Source)
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పాలనపై ప్రజల్లో ఆగ్రహం
- పాలక, మతాధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు
- క్రౌన్ ప్రిన్స్ రెజా ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి వేళ నిరసనలు
Anti Khamenei Protests: ఇరాన్‌లో సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హొసేని ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్రతరమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ క్షీణించి, జీవన వ్యయం భారీగా పెరగడం, భద్రతా బలగాల అణచివేత చర్యలపై ఆగ్రహంతో టెహ్రాన్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాలక మతాధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గత రాత్రి నిరసనలు తీవ్రతరం కావడంతో ఇంటర్నెట్, అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్ నేతృత్వంలోని ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసింది. ఇరాన్ పాలనలో తుది అధికారం సుప్రీం లీడర్‌ది. ఆయన ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పనిచేస్తారు.
విదేశాల్లో నివసిస్తున్న క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి ఇచ్చిన పిలుపు మేరకు నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు రెజా పహ్లవి తండ్రి మొహమ్మద్ రెజా షా పహ్లవి ఇరాన్‌ను విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్‌లో మొదలైన ఈ నిరసనల్లో.. షా పాలనకు అనుకూల నినాదాలు వినిపించాయి. స్వేచ్ఛ కావాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.
“పహ్లవి తిరిగి వస్తాడు” అంటూ నినాదాలు
గురువారం, శుక్రవారం రాత్రి 8 గంటలకు నిరసనలు చేపట్టాలని పహ్లవి పిలుపునిచ్చారు. ఆ సమయంలో టెహ్రాన్‌లోని అన్ని ప్రాంతాల్లో నినాదాలు మార్మోగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
“నియంత పాలన అంతం కావాలి”, “ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలి” అనే నినాదాలు నిరసనల్లో వినిపించాయి. మరికొందరు “ఇది చివరి పోరాటం, పహ్లవి తిరిగి వస్తాడు” అని అన్నారు. కమ్యూనికేషన్‌ను ప్రభుత్వం పూర్తిగా నిలిపేయక ముందే వేలాది మంది వీధుల్లో కనిపించారు.
“రాత్రి సమయంలో ఇరాన్ ప్రజలు స్వేచ్ఛను కోరుతూ నిరసనల్లో పాల్గొన్నారు. ప్రతిస్పందనగా పాలకులు కమ్యూనికేషన్ వ్యవస్థలను బంద్ చేశారు. ఇంటర్నెట్ నిలిపివేశారు, ల్యాండ్‌లైన్లను కట్ చేశారు, శాటిలైట్ సిగ్నల్స్‌ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు” అని పహ్లవి అన్నారు.
ఈ పరిస్థితులు రావడానికి ఇరాన్ పాలక వ్యవస్థే కారణమని, ఆ వ్యవస్థే దీనికి బాధ్యత వహించేలా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి యూరోపియన్ నేతలు హామీ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
తన పిలుపునకు వచ్చిన స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని పహ్లవి తెలిపారు. ఇజ్రాయెల్‌కు ఆయన గతంలో మద్దతు ఇవ్వడంతో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జూన్‌లో ఇజ్రాయెల్ 12 రోజుల పాటు ఇరాన్‌పై సాగించిన యుద్ధం తరువాత ఆయనను పలువురు విమర్శించారు.
గత రాత్రి జరిగిన నిరసనల్లో షా అనుకూల నినాదాలు వినిపించినప్పటికీ.. అవి పహ్లవికి మద్దతుగా చేశారా? లేదా 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందున్న విధానాలను తిరిగి కోరుకుంటున్నారా? అన్న విషయంలో స్పష్టత లేదు.
ఇరాన్ అంతటా విస్తరించిన నిరసనలు
ఇరాన్ వ్యాప్తంగా నగరాలు, గ్రామీణ పట్టణాల్లో గురువారం నిరసనలు కొనసాగాయి. నిరసనకారులకు మద్దతుగా వ్యాపారులు మార్కెట్లను మూసివేశారు. ఇప్పటివరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో 42 మంది మృతి చెందారు, 2,270 మందికి పైగా అరెస్టయ్యారని అమెరికాలో ఉన్న హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
This footage shows a large crowd of anti-regime protesters on Bahar Shiraz Street in #Tehran, capital city of #Iran. They can be seen marching toward Haft-e Tir and Sohrevardi streets and chanting “#JavidShah” (Long Live the Shah). #IranProtests pic.twitter.com/P13DYHWiDx
— Babak Taghvaee – The Crisis Watch (@BabakTaghvaee1) January 9, 2026
