బాగ్దాద్ హాస్పిటల్ అగ్నిప్రమాదంలో 82కి చేరిన మృతుల సంఖ్య

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అల్-రుసాఫా ఏరియాలోని కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న

Baghdad Hospital Fire

Baghdad hospital fire ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అల్-రుసాఫా ఏరియాలోని కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న “ఇబ్న్ ఖతీబ్”హాస్పిటల్ లో శనివారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 82కి చేరింది. ఈ ప్రమాదంలో 110మందికి పైగా గాయాలపాలయ్యారని ఇరాక్ ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇక, మరణించిన వారిలో 28మంది కరోనాతో పోరాడుతూ వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్లేనని ఇరాక్ స్వతంత్ర మానవ హక్కుల కమిషన్ ప్రతినిధి అలీ అల్-బయాటి ట్వీట్ చేశారు.

శనివారం రాత్రి ఇబ్న్ ఖతీబ్ ఆసుపత్రిలోని రెండవ అంతస్తులోని ఓ వార్డులో ఆక్సిజన్ సిలండర్ పేలడం వల్లే అగ్నిప్రమాదం జరిగనట్లు ప్రాథమిక రిపోర్ట్ లో తేలింది. మంటలను చూసిన జనం భవనం నుండి పారిపోతున్నప్పుడు ప్రమాదానికి గురయ్యారు. కొందరు కిటికీల నుంచి బయటకు దూకారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హాస్పిటల్ వద్దకు చేరుకొని మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. తెల్లవారుజాము సమయానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మరోవైపు, అంబులెన్సులు డజన్ల కొద్దీ గాయపడిన వారిని వేరే హాస్పిటల్ కు తరలించాయి. ఘటనా స్థలం నుంచి కనీసం 200 మందిని రక్షించినట్లు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక, ఈ ఘటనపై ఇరాక్ ప్రధాన మంత్రి ముస్తఫా అల్-ఖాదిమి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై తక్షణ దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిని గుర్తించే వరకు హాస్పిటల్ మేనేజర్, భద్రత, మెయింటెనెన్స్ విభాగాధిపతులను అరెస్టు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. బాగ్దాద్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరక్టర్ జనరల్ ను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.