Xi Jinping Under House Arrest?
Xi Jinping Under House Arrest? : చైనాలో ఏం జరుగుతోంది..? ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. సైనిక తిరుగుబాటు జరిగిందా…జిన్ పింగ్ గృహనిర్బంధంలా ఉన్నారా లేక…ఆయనే ఇప్పటికీ దేశాధ్యక్షుడా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు అక్టోబరు 16 నుంచి జరిగే కాంగ్రెస్‌కు హాజరయ్యే సభ్యులందరినీ ఎన్నుకున్నామని కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది. జిన్‌పింగ్ గృహ నిర్బంధం వార్తల మధ్య కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటనతో అయోమయానికి తెరపడిందని భావిస్తున్నారు.
అక్టోబరు 16 నుంచి చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ జరగనుంది. ఐదు సంవత్సరాలకోసారి జరిగే ఈ సమావేశం కమ్యూనిస్ట్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది. ఈ కాంగ్రెస్‌లోనే దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇంతకుముందు దేశాధ్యక్షపదవికి రెండుసార్లు మాత్రమే ఎన్నికయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగిన కాంగ్రెస్‌లో ఈ నిబంధనను సవరించారు. దీంతో మరో ఐదేళ్లు జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, దేశాధ్యక్షునిగా కొనసాగే అవకాశముంది. వచ్చే నెలలో జరిగే ఈ సమావేశంలో జిన్‌పింగ్ మూడోసారి దేశాధ్యక్షుడు కావడం లాంఛనప్రాయమని అందరూ భావిస్తుండగానే ఆయన గృహనిర్బంధం వార్తలు షాకిచ్చాయి. చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, ఆర్మీ అధ్యక్షున్ని హౌస్ అరెస్ట్ చేసిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.
ఈ ప్రచారంపై చైనా మీడియా అధికారికంగా స్పందించకపోవడంతో రెండురోజులుగా ఇవి కొనసాగుతున్నాయి. ఆరువేల అంతర్జాతీయ, స్థానిక విమానాలు క్యాన్సిల్ చేయడం, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టికెట్ల అమ్మకాలు నిలిపివేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఈ సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌కు హాజరయ్యే ప్రతినిధులందరినీ ఎన్నుకున్నామని ప్రకటించింది. కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ప్రతి నిర్ణయం ఈ కాంగ్రెస్‌లోనే జరుగుతుంది. ఇది 20వ కాంగ్రెస్ సమావేశం. దేశవ్యాప్తంగా ప్రతి ఎలక్టోరల్ యూనిట్ ఓటింగ్‌లో పాల్గొందని, కాంగ్రెస్‌కు హాజరయ్యే 2వేల296 మంది ప్రతినిధులును ఎన్నుకుందని పార్టీ ప్రకటించింది.
సైనిక తిరుగుబాటు వార్తలపై నేరుగా స్పందించకుండా…ప్రతినిధుల ఎన్నిక ప్రకటనను కమ్యూనిస్ట్ పార్టీ చేసిందని భావిస్తున్నారు. తద్వారా తిరుగుబాటు జరగలేదన్న విషయాల్ని అధికారికంగా వెల్లడించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు షాంఘై కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశాన్ని ముగించుకొని వచ్చిన జిన్‌పింగ్ కరోనా క్వారెంటెయిన్‌లో ఉన్నారని ఆ దేశ ప్రజలు కొందరంటున్నారు. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా ప్రయాణాలు చేసిన ప్రతి ఒక్కరికీ చైనాలో క్వారెంటెయిన్ తప్పనిసరిని జిన్‌పింగ్ అదే అనుసరిస్తున్నారని భావిస్తున్నారు.
అవినీతి వ్యతిరేక ప్రచారం చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవలే కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్ష, నలుగురు అధికారులకు జీవిత ఖైదు విధించింది. ఈ ఆరుగురూ జిన్‌పింగ్ వ్యతిరేకులని, వారి వర్గీయులే గృహనిర్బంధం ప్రచారం ప్రారభించారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.