176 మంది మృతి : పొరపాటైంది..విమానం కూల్చివేతపై ఇరాన్ ప్రకటన

  • Publish Date - January 11, 2020 / 10:17 AM IST

ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేయడంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో పొరపాటను అంగీకరించింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షమించరాని తప్పు జరిగిందని, ఈ కారణంగా 176 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. దీనిపై తాము ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

 

టెహ్రాన్ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయలుదేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపట్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు తొలుత ఇరాన్ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ విఫలమయ్యాయి. చివరకు పొరపాటును ఒప్పుకుంది. 

 

మానవ తప్పిదంతో క్షిపణులను ప్రయోగించడం వల్లే..దురదృష్టవశాత్తు ఉక్రెయిన్ విమానం కూలిపోయిందని దర్యాప్తులో తేలిందని రౌహానీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్షమించరాని తప్పిదం కారణంగా 176 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తామని ప్రకటించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విచారం వ్యక్తం చేస్తోంది..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. 

Read More : నోటి దూల : పృథ్వీ వాఖ్యలపై వైసీపీ సీరియస్

ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్ కూడా స్పందించారు. అమెరికా వల్ల తలెత్తిన సంక్షోభం..మానవ తప్పిదం కారణాల వల్ల ఈ ఘోరం జరిగిందని తెలిపారు. విమాన ప్రమాదంలో చనిపోయిన ఇరాన్, ఇతర దేశాల మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెబతున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా ఇరాన్ చేసిన ప్రకటనపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.