Israel Hamas War (Photo Credit : Google)
Israel Hamas War : పశ్చిమాసియా భగ్గుమంటున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఆయుధాలను వదిలి బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్ పౌరులను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం రేపే ముగుస్తుందని పేర్కొన్నారు. తమ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు వారు బయటకు వచ్చి జీవించేలా అవకాశం కల్పిస్తామన్నారు. లేదంటే వేటాడి మరీ హతమారుస్తామని హెచ్చరిచారు. ఇలా ఉంటే, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి తర్వాత ఇజ్రాయెల్ సైన్యం దృష్టి ఇప్పుడు అతడి సోదరుడిపై పడింది. సిన్వార్ సోదరుడు మహమ్మద్, ఇతర హమాస్ మిలటరీ కమాండ్ల జాడ కోసం గాలిస్తున్నామని ఐడీఎఫ్ వెల్లడించింది.
ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. వెంటాడి వేటాడి మరీ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ను వేసేసింది. గాజాలోని యాహ్యా సిన్వార్ ను ఇజ్రాయెల్ కు చెందిన యువ సైనికులు మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సైనికులు 9 నెలల క్రితమే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లో చేరారు. గతేడాది ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడులు చేసినప్పుడు వారు ఆర్మీలోనే లేరు.
గతేడాది అక్టోబర్ 7ర ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 200 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. దాంతో హమాస్ పై యుద్ధం ప్రకటించింది ఇజ్రాయెల్. హమాస్ అగ్రనేతలు అందరినీ చంపుతామని ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుంచి ఒక్కొక్కరిని వేటాడుతూ మట్టుబెట్టింది. మమహ్మద్ డైఫ్, ఇస్మాయిల్ హనియే, మర్వాన్ ఇస్సా, రాద్ సాద్, సలేహ్ అల్ అరౌరీ.. తాజాగా యాహ్యా సిన్వార్.. ఇలా టాప్ కమాండర్లు అందరినీ వరుసగా వేసేసింది ఇజ్రాయెల్.
సిన్వార్ ను మట్టుబెట్టి హమాస్ తో యుద్ధంలో మరోసారి పైచేయి సాధించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ ముగ్గురిని హతమార్చింది. ఇందులో సిన్వార్ కూడా ఉన్నాడు. గతేడాది ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడికి వెనుక మాస్టర్ మైండ్ సిన్వార్ యే. దాంతో అప్పటి నుంచి సిన్వార్ కోసం ఇజ్రాయెల్ ఆర్మీ వేటాడింది. చివరికి వేసేసింది. ఇక సిన్వార్ కంటే ముందు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.
Also Read : వెంటాడి వేటాడి యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్.. ఇక హమాస్ పనైపోయిందా? తదుపరి అధిపతి ఎవరు?