Most Expensive Icecream : ఐస్‌క్రీమ్ ధర అక్షరాల రూ. 5 లక్షలు..! గిన్నిస్ రికార్డు సాధించిన ఈ హిమక్రీము ప్రత్యేకతేంటో తెలుసా..?

Worlds most expensive ice cream

World Most Expensive Icecream : ఎండలు మాడు పగులగొడుతున్నాయి. ఎర్రటి ఎండలో చల్లచల్లని ఐస్‌క్రీమ్ తింటే .. కూల్ కూల్ గా గొంతులో దిగుతుంటే అబ్బా ప్రాణం లేచివస్తుంది కదూ. మరి ఐస్‌క్రీమ్ తినాలంటే తక్కువలో తక్కువ 25 రూపాయలన్నా ఖర్చు చేయాల్సిందే. అఫ్ కోర్స్ 10 రూపాయలకు కూడా ఐస్‌క్రీమ్ ఉంటుందనుకోండీ. ఐస్‌క్రీమ్ ల ధరలు మహా ఉంటే ఓ రెండు మూడు వందల రూపాయలు అనుకోవచ్చు.  ఇంకా అయితే ఓ వెయ్యిరూపాయలు అనుకుందాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐస్‌క్రీమ్ ధర అక్షరాలు రూ.5.2 లక్షలు! ఏంటి దిమ్మ తిరిగిపోయిందా..? మీరు చెప్పేది ఐస్‌క్రీమ్ ధరా? లేదా ఓ కారు ధరా? ఓ సారి ఆలోచించి చెప్పండీ అంటారా? నిజ్జంగా నిజం.. ఈ ఐస్‌క్రీమ్ ధర అక్షరాలు రూ.5.2 లక్షలు..!!

జపాన్ కు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్ ప్రపంచంలోనే ఖరీదైన ఐస్‌క్రీమ్. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించింది. ఈ ఖరీదైన ఐస్‌క్రీమ్ ధర 8,73,400 జపాన్ యెన్ లుగా నిర్ణయించింది. మన రూపాయిల్లో చెప్పాలంటే, రూ.5.2 లక్షలన్నమాట..!

ఖరీదైన అరుదైన పదార్థాలతో జపాన్ కు చెందిన సెల్లాటో కంపెనీ ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా గుర్తించింది. ఇటలీలో పెరిగే వైట్ ట్రఫిల్ (ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థాలలో ఒకటి) ను ఈ ఐస్‌క్రీమ్ వినియోగించారు. ఇక ఈ ఐస్‌క్రీమ్ తయారు చేయటానికి సంవత్సరన్నర సమయం పట్టిందని కంపెనీ ప్రతినిధి ప్రకటించారు.

అంతకాలం ఎందుకు అనుకుంటున్నారా..? ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాతే తుది ఉత్పత్తిని తీసుకొచ్చారట. ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసి రుచి చూస్తే.. చివరికి వారికి నచ్చినట్టు ఆకారం, రుచిని సాధించడానికి అంత సమయం పట్టిందట. ప్రపంచంలో ఖరీదైన ఐస్ క్రీమ్ తయారు చేయాలన్న సంకల్పంతోనే దీన్ని రూపొందించారు. దీని ధరను చూసిన వారు, విన్నవారు కూడా ఓ మై గాడ్ అని అంటున్నారు. నిజమే మరి అలా అని తీరాల్సిందే అనేలా ఉందీ దీని ధర. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈ ఐస్‌క్రీమ్ కు సంబంధించి 30 సెకన్ల వీడియోపై ఓ లుక్కేయండీ..