Japanese Man
Japanese Man Relieve Stress : మీరు ఏదైనా పనిచేసే సమయంలో ఒత్తిడికి గురైతే ఏం చేస్తారు..? చేసేపనికి కాస్త విరామం ఇచ్చి రిలీఫ్ అవుతారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు మీకు ఇష్టమైన వ్యాపకాలపై దృష్టిసారిస్తారు. కొందరు సినిమాలు చూడడం, మరికొందరు మ్యూజిక్ వినడం, మరికొందరు క్రీడలు ఆడటం ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు తమలోని ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ, జపాన్ కు చెందిన ఓ వ్యక్తి ఒత్తిడిని తగ్గించుకునేందుకు విచిత్రంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Also Read: Israel: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని.. హెజ్బొల్లాకు వార్నింగ్.. ఎందుకంటే?
దక్షిణ జపాన్ లోని దజైఫు ప్రాంతంలో 37ఏళ్ల వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతడు ఓ ఇంట్లోకి దూరడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని విచారణ చేయగా.. అతడు చెప్పిన సమాధానంకు పోలీసులు షాక్ కు గురయ్యారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఇప్పటి వరకు వెయ్యి ఇళ్లలోకి చొరబడినట్లు సదరు నిందితుడు చెప్పాడు.
ఒత్తిడి నుంచి ఉపశమనంకోసం ఇతరుల ఇళ్లలోకి చొరబడటం తన హాబీ అని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. దొంగతనానికి వెళ్లిన సమయంలో తనను ఎవరైనా గుర్తించారా లేదా అనే విషయంపై ఆలోచించినప్పుడు.. నా అరచేతులు చెమటలు పట్టేంతగా నేను ఆందోళనకు గురైతే, అది నాలోని ఒత్తిడిని తగ్గిస్తుందని నిందితుడు పోలీసులకు వివరించాడు. ఈ విషయాన్ని జపాన్ డైలీ వార్తాపత్రిక మైనిచి షింబున్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.