కశ్మీర్ భారత సార్వభౌమ భాగం : పీవోకేను పాక్ ఖాళీ చేయాలన్న బ్రిటన్ ఎంపీ

జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది.  పాక్ ఆక్రమిత కశ్మీర్ (pok)ను పాక్ ఖాళీ చేయాలంటూ  బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌ మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారత్ సార్వభౌమ భాగం అని అన్నారు. జమ్ముకశ్మీర్‌ను తిరిగి ఏకం చేయడానికి ఇదే సరైన సమయమని బాబ్ అభిప్రాయపడ్డారు.

యూకేలోని కశ్మీర్ పండిట్లు శనివారం లండన్‌ లో బలిదాన్ దివస్ నిర్వహించారు. కశ్మీర్‌లో గూడు కోల్పోయిన తమ మనోభావాలకు అద్దం పడుతూ కశ్మీర్ పండిట్స్ కల్చరల్ సొసైటీ, ఆల్ ఇండియా కశ్మీరీ సమాజ్(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో యూకేలో స్థిరపడిన కశ్మీర్ పండిట్ల చిన్నారులు ఉయ్ రిమెంబర్: ది జర్నీ ఆఫ్ కశ్మీరీ పండిట్స్ అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారత్ సార్వభౌమ భాగం. ఐరాస తీర్మానం అమలు చేయాలని కోరుతున్న వ్యక్తులు, ఆక్రమిత కశ్మీర్ నుంచి పాక్ సైనిక బలగాలు వైదొలగి ఆ రాష్ట్రాన్ని ఏకం చేయాలన్న తొలి తీర్మానాన్ని విస్మరిస్తున్నారన్నారు. వోకేను పాకిస్థాన్ ఖాళీ చేయాలని స్పష్టం చేశారు

 ఆర్టికల్ 370రద్దు తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా శుక్రవారం పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్ ప్రజలను నిరాశపర్చబోమన్న ఆయన, వచ్చేవారం జరుగనున్న ఐరాస సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్న సమయంలో పాక్ తీరును బ్లాక్‌మన్ తప్పుపట్టారు.