Biden
US President Joe Biden: కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. లక్ష కేసులతో పాటు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. డెల్టా వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బూస్టర్ డోసు కచ్చితంగా ఇవ్వాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు. డెల్టా కేసులు పెరగడానికి తోడు వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోవడంతో అమెరికన్ పౌరులంతా తమ రక్షణను పెంచుకొనేందుకు మూడో డోసు వేయించుకోవాలని సూచిస్తున్నారు.
సీడీసీ డైరెక్టర్, ఇతర ఉన్నత స్థాయి అధికారులు ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం ఇప్పటికే ఫైజెర్, మోడర్నా వ్యాక్సిన్లు రెండు డోసులు పొంది ఎనిమిది నెలలు పూర్తయిన వ్యక్తులకు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి మరో డోసు ఇవ్వాలని భావిస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా మొదటి డోసు తీసుకున్నవారకి కూడా మరో డోసు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌డీఏ ఆమోదం తర్వాత కరోనావైరస్ బూస్టర్ షాట్‌లు అందుబాటులో ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు.
షాట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ సెకండ్ షాట్ పొందిన ఎనిమిది నెలల తర్వాత ప్రజలకు అందించనున్నట్లు బిడెన్ చెప్పారు. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు తమ మొదటి టీకా షాట్ల కోసం ఎదురుచూస్తుండగా, COVID-19 కి వ్యతిరేకంగా అమెరికన్లు అదనపు రక్షణ పొందుతారనే విమర్శలపై బిడెన్ స్పందించారు. ప్రపంచంలో ప్రతీ దేశం మొదటి షాట్ పొందేవరకు అమెరికా మూడో షాట్ పొందకూడదని ప్రపంచ నాయకులు చెబుతున్నారు. కానీ, దానికి నేను అంగీకరించనని బిడెన్ వైట్ హౌస్‌లో అన్నారు. “మేము ముందు అమెరికాను జాగ్రత్తగా చూసుకుని తర్వాతే ప్రపంచానికి సహాయం చేస్తాము” అని అన్నారు.
అయితే, కొవిడ్-19 వ్యాక్సిన్‌లు డెల్టా వేరియంట్‌పై భేషుగ్గా పనిచేస్తున్నాయని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ అన్నారు. బూస్టర్ డోసుల కోసం అనవసరమైన హడావుడి వద్దసన్నారు. అయితే, బూస్టర్ డోసుపై తాత్కాలిక నిషేధం విధించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తిని మాత్రం ఆయా దేశాలు పట్టించుకోవట్లేదు.