×
Ad

బంగ్లా మాజీ ప్రధాని ఖలేదా జియా కన్నుమూత.. ఎవరీమె? ఈమె కొడుకు ‘డార్క్ ప్రిన్స్’ పునరాగమనం తర్వాత..

ఖలేదా జియా మృతి పట్ల భారత ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

Khaleda Zia

Khaleda Zia: బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలేదా జియా మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 80 ఏళ్లు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఖలేదా జియా నవంబర్ 23న గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు.

ఆమె గత 36 రోజులుగా చికిత్స పొందుతున్నారు. బంగ్లాదేశ్ దినపత్రిక ది డైలీ స్టార్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఆమె న్యుమోనియాతో కూడా బాధపడుతున్నారు.

Also Read: సర్‌ప్రైజ్‌.. గర్ల్‌ఫ్రెండ్‌ అవీవాతో ప్రియాంకా గాంధీ కుమారుడు రెహాన్‌ వాద్రాకు నిశ్చితార్థం

“బీఎన్‌పీ చైర్‌పర్సన్, మాజీ ప్రధానమంత్రి, జాతీయ నాయకురాలు బేగమ్ ఖలేదా జియా ఫజర్ నమాజు అనంతరం ఈ రోజు ఉదయం 6 గంటలకు కన్నుమూశారు. ఆమె ఆత్మ శాంతి కోసం అందరూ ప్రార్థనలు చేయాలని కోరుతున్నాం” అని పార్టీ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, ఖలేదా జియా కుమారుడు, ఆ దేశ రాజకీయాల్లో ఒకప్పుడు “డార్క్ ప్రిన్స్”గా గుర్తింపు పొందిన తారిక్ రహమాన్ ఇటీవలే తిరిగి బంగ్లాదేశ్‌కు వచ్చిన విసయం తెలిసిందే. 17 ఏళ్లు విదేశాల్లో ఉండి ఆయన బంగ్లాకు వచ్చారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో జరిగే ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.

మోదీ సంతాపం
ఖలేదా జియా మృతి పట్ల భారత ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. “బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బీఎన్‌పీ చైర్‌పర్సన్ బేగమ్ ఖలేదా జియా మరణవార్త గురించి తెలిసింది. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలందరికీ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ విషాదకర పరిస్థితిని తట్టుకునే ధైర్యాన్ని ఆమె కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆమె చేసిన కీలక సేవలు బంగ్లాదేశ్ అభివృద్ధికి, భారత్-బంగ్లాదేశ్ సంబంధాలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 2015లో ఢాకాలో ఆమెతో జరిగిన స్నేహపూర్వక భేటీ నాకు గుర్తుంది. ఆమె దృష్టి, వారసత్వం మా భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని ఆశిస్తున్నాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.